Changure Bangaru Raja Review in Telugu:ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 15, 2023 / 04:06 PM IST

Cast & Crew

  • కార్తీక్ రత్నం (Hero)
  • గోల్దీ నిస్సీ (Heroine)
  • రవిబాబు, సత్య, అజయ్, తదితరులు.. (Cast)
  • సతీష్ వర్మ (Director)
  • రవితేజ (Producer)
  • కృష్ణ సౌరభ్ (Music)
  • సుందర్ ఎన్.సి (Cinematography)

మాస్ మహారాజా రవితేజ నిర్మాణ సారధ్యంలో రూపొందిన తాజా చిత్రం “ఛాంగురే బంగారు రాజా”. ‘సలార్” పోస్ట్ పోన్ అవ్వడంతో సడన్ గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబడి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సి జంటగా నటించగా రవిబాబు, సత్య కీలకపాత్రలు పోషించారు. విడుదలైన టీజర్ & ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు నమోదయ్యాయి. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: నర్సీపట్నంలోని ఓ సాధారణ బైక్ మెకానిక్ బంగార్రాజు (కార్తీక్ రత్నం). తాను ప్రేమించిన అమ్మాయికి సైట్ కొట్టుకుంటూ, అప్పుడప్పుడూ స్నేహితుడుతో కలిసి రంగు రాళ్ళ గురించి కబుర్లు చెబుతూ హ్యాపీగా గడిపేస్తుంటాడు. అలాంటి బంగార్రాజును పోలీసులు ఓ హత్య కేసులో నిందితుడిగా పరిగణించి అరెస్ట్ చేస్తారు. దాంతో అతడి ప్రపంచం తలకిందులవుతుంది. ఈ హత్య కేస్ నుంచి బంగార్రాజు ఎలా బయటపడ్డాడు? రంగురాళ్ళు అతడి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాయి? అనేది “ఛాంగురే బంగారు రాజా” కథాంశం.

నటీనటుల పనితీరు: కార్తీక్ రత్నం ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు. కానీ.. కామెడీ విషయంలో కాస్త వీక్ అనే విషయంలో ఈ సినిమాలో స్పష్టమైంది. చాలా సన్నివేశాల్లో సత్య కామెడీ టైమింగ్ ను అందుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. కాకపోతే.. ఎమోషనల్ సీన్స్ & డైలాగ్ డెలివరీ విషయంలో ఆకట్టుకున్నాడు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇంటర్నెట్ ఆడియన్స్ కు సుపరిచితురాలైన గోల్డీ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. లుక్స్ పరంగా పర్వాలేదు కానీ.. హావభావాల ప్రకటనలో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. కొన్ని సన్నివేశాల్లో సందర్భానికి సంబంధం లేని ముఖభావంతో కనిపించింది.

సత్య మాత్రం తన స్క్రీన్ ప్రెజన్స్ & కామెడీ టైమింగ్ తో విశేషంగా ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో క్యాస్టింగ్ మొత్తాన్ని డామినేట్ చేసేశాడు. సత్య ముందు మిగతావాళ్ళంతా పిల్లల్లా కనిపించారు. కొంచెం గ్యాప్ తర్వాత రవిబాబు తన ఫేవరెట్ జోనర్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఈ తరహా విలనిజాన్ని ప్రస్తుత తరంలో ఆయన తప్ప ఎవరూ పండించలేరు. రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ గా అజయ్ తన పాత్రకు న్యాయం చేశాడు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. సినిమా క్వాలిటీ అనేది థియేట్రికల్ రిలీజ్ కి చాలా ముఖ్యం. రవితేజ లాంటి ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదో అర్ధం కాలేదు. మరి సినిమాటోగ్రాఫర్ సుందర్ కి సరైన బడ్జెట్ ఇవ్వలేదో లేక డి.ఐ చేయడానికి టైమ్ ఇవ్వలేదో తెలియదు కానీ.. అవుట్ పుట్ క్వాలిటీ అంతగా బాలేదు. కృష్ణ సౌరభ్ పాటలు, ఆ పాటల సాహిత్యం బాగున్నాయి. నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా సోసోగా ఉంది. దర్శకుడు సతీష్ వర్మ రాసుకున్న కథ ఆసక్తికరంగా ఉన్నా.. ఆ కథను నడిపించే కథనాన్ని అల్లుకున్న విధానం మాత్రం ఆకట్టుకొనే విధంగా లేదు.

ముఖ్యంగా సెకండాఫ్ చాలా పేలవంగా ఉంది. ఏదో సత్య కామెడీ వల్ల క్లైమాక్స్ పేలింది కానీ.. లేదంటే అది కూడా అంతగా వర్కవుటయ్యేది కాదు. సతీష్ స్క్రీన్ ప్లే & లాజిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ముఖ్యంగా ముగింపు చాలా కంగారుగా ఉంటుంది. ఇంతకంటే ఆడియన్స్ ను కూర్చోబెట్టలేం అన్నట్లుగా ముగించేశాడు. అందువల్ల.. సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చేప్పుడు ఎందుకో అసంతృప్తి.

విశ్లేషణ: రవితేజ ప్రొడక్షన్ అనేసరికి మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది “ఛాంగురే బంగారు రాజా”. కార్తీక్ రత్నం నటన, కృష్ణ సౌరభ్ సంగీతం బాగున్నా.. సరైన కథనం & ముగింపు లేని కారణంగా ఆడియన్స్ ను అలరించలేకపోయింది. ఆడియన్స్ ను రెండు గంటలు థియేటర్లో కూర్చోబెట్టగలిగే సత్తా.. బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకునే దమ్ము ఈ సినిమాకి లేనందున ఈ వారాంతపు విడుదలల్లో “ఛాంగురే బంగారు రాజా” నిలదొక్కుకోవడం కష్టమే.


రేటింగ్: 1.5/5

Click Here To Read in ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus