చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 26, 2021 / 04:10 PM IST

విభిన్న కథాంశాలతో చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం “చెక్”. నితిన్, ప్రియప్రకాశ్ వారియర్, రకుల్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 26) విడుదలైంది. ఏలేటి మార్క్ ఎంటర్ టైన్మెంట్ ను “చెక్” అందించిందా? “భీష్మ”తో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ కెరీర్ కు హెల్ప్ అయ్యిందా? భవ్య ఆనంద్ ప్రసాద్ కు ఎట్టకేలకు హిట్ దొరికిందా లేదా? అనేది చూద్దాం..!!

కథ: 40 మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో ఉరి శిక్ష పడి ఇరుక్కుంటాడు ఆదిత్య (నితిన్). తాను నిర్ధోషి అని ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. కోర్టు ఆదిత్య కోసం ప్రాక్టీస్ లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్)ను అపాయింట్ చేస్తుంది. ఇదే సమయంలో ఏక సంతాగ్రహి అయిన ఆదిత్య జైల్లో 13 ఏళ్ళగా శిక్ష అనుభవిస్తున్న శ్రీమన్నారాయణ (సాయిచంద్) దగ్గర చెస్ నేర్చుకుంటాడు. ఆ చెస్ ఆదిత్య లైఫ్ ను మార్చేస్తుంది.

 

అప్పటివరకూ ఒక ఖైధీగా, టెర్రరిస్ట్ గా మాత్రమే ప్రపంచానికి తెలిసిన ఆదిత్య సడన్ గా చెస్ గ్రాండ్ మాస్టర్ అయిపోతాడు. చెస్ ఆదిత్య జీవితాన్ని ఎలా మార్చింది? చివరికి జైల్ నుంచి తప్పించుకున్నాడా లేదా? అనేది “చెస్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: నితిన్ కాన్ ఆర్టిస్ట్ రోల్ కి సెట్ అయ్యాడు. అయితే.. ఒక ఉరి శిక్ష ఖైధీలో ఉండే ఇంటెన్సిటీ మాత్రం నితిన్ కళ్ళల్లో కనిపించలేదు. సబ్టల్ పెర్ఫార్మెన్స్ కి ఇంటెన్సిఫైడ్ పెర్ఫార్మెన్స్ కి తేడా చూపించలేకపోయాడు. రకుల్ సహాయ పాత్ర పోషించింది. లాయర్ గా ఆమె నటన సోసోగానే ఉంది. ప్రియా ప్రకాష్ వారియర్ ఒక పాట, రెండు సీన్లకు పరిమితమైపోయింది. ఫిదా, సైరా తర్వాత సాయిచంద్ కి మళ్ళీ మంచి రోల్ వచ్చింది. సంపత్, మురళీశర్మ, కృష్ణతేజ, హర్షవర్ధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: డైరెక్టర్ ఏలేటి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే.. భారీ స్థాయి అంచనాలు లేకపోయినా, ఆయన సినిమా అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన సినిమాలో ఒక నిజాయితీ ఉంటుంది. ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ థియాట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం పరితపించే అతికొద్ది మంది దర్శకుల్లో ఏలేటి ఒకరు. అందుకే ఆయన సినిమాలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ను అలరిస్తుంటాయి. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల్లో కమర్షియల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ బ్యాడ్ ఫిలిమ్స్ లేవు. అలాంటి ఏలేటి “చెక్” సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

“శవ్శాంక్ రిడెంప్షన్, ప్రిజన్ బ్రేక్, ఇంసైడ్ మ్యాన్, మనీ హెయిస్ట్” లాంటి సినిమాల స్పూర్తి గట్టిగా కనిపిస్తుంది. ఏలేటి 2007లో తీసిన “ఒక్కడున్నాడు” కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో 2010లో సినిమా వచ్చిందే అంటే గర్వంగా ఫీలైన ఆయన అభిమానులు, ఇప్పుడు ఆయనే ఇన్ని హాలీవుడ్ సినిమాల నుంచి స్పూర్తి పొందడంతోపాటు.. చాలా సన్నివేశాలు మక్కీకి మక్కీ దించేయడం గమనార్హం. ఏదైనా సినిమా కాన్సెప్ట్ నచ్చి స్పూర్తి పొందడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ.. మరీ మక్కీకి మక్కీ దింపడం మాత్రం ఇంటర్నేషనల్ ఆడియన్స్ & మల్టీప్లెక్స్ ఆడియన్స్ విషయంలో బెడిసికొడుతుంది.

 

ఆయన రాసుకున్న కథలో మొదటిసారి కొత్తదనం లోపించింది, కథనం చాలా సాదాసీదాగా సాగింది. కథలో అతిముఖ్యమైన ట్విస్టులను ఆడియన్స్ ముందే పసిగట్టేస్తారు. ఒక థ్రిల్లర్ సినిమాకు ఇలాంటివన్నీ మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి. కళ్యాణి మాలిక్ అలియాస్ కళ్యాణి రమణ సమకూర్చిన ఒకే ఒక్క పాట వినసోంపుగా ఉంది. నేపధ్య సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. రాహుల్ శ్రీవాత్సవ సినిమాటోగ్రఫీ కథ థీమ్ ను ఎలివేట్ చేయలేకపోయింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ డిజైన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సినిమాకి ఉన్నవే చాలా తక్కువ లొకేషన్స్, వాటిని కూడా నేచురల్ గా చూపిచలేకపోయారు. ముఖ్యంగా జైల్ సెట్ & కోర్ట్ రూమ్ సెట్స్ విషయంలో కనీస స్థాయి హోమ్ వర్క్ చేయకపోవడం హాస్యాస్పదం.

విశ్లేషణ: “ఏలేటి సినిమా” అనే ఇమేజ్ మైండ్ లో లేకపోతేనే “చెక్” ఓ మోస్తరుగా నచ్చుతుంది. లేదంటే నిరాశకు లోనవ్వడం ఖాయం. తెలుగు సినిమా స్థాయిని పెంచగలిగే సత్తా ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరైన చంద్రశేఖర్ ఏలేటి మళ్ళీ తన సత్తా చాటుకొనే సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉంటాం.

రేటింగ్: 2/5

Click Here To Read In English

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus