చెలియా

  • April 7, 2017 / 11:22 AM IST

ప్రఖ్యాత దర్శకులు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం “చెలియా”. యుద్ద నేపధ్యంలో సాగే రోమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ-అదితిరావు హైదరీ జంటగా నటించారు. రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నేడు (ఏప్రిల్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “చెలియా” సినిమా విశేషాలు మీకోసం..!!

కథ : వరుణ్ (కార్తీ) ఇండియన్ ఆర్మీలో పైలట్ ఫైటర్. కార్గిల్ వార్ సమయంలో పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా బంధింపబడతాడు. జైల్లో లీలా (అదితిరావు హైదరీ)తో తన ప్రేమకథను నెమరవేసుకొంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. ఒకానొక సందర్భంగా జైలు నుంచి తప్పించుకొనే అవకాశం లభిస్తుంది. ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ముఖ్యమని భావించి పాకిస్తాన్ జైల్ నుంచి పారిపోతాడు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని బోర్డర్ దాటుతుండగా ఒక దారుణం చోటు చేసుకొంటుంది. ఏమిటా దారుణం, చివరికి వరుణ్-లీలా మళ్ళీ కలుసుకోగలిగారా? లేదా? అనే విషయం తెలియాలంటే “చెలియా” సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : కార్తీ ఈ చిత్రంలో ఫైటర్ పైలట్ గా బాడీ లాంగ్వేజ్ ను బాగా మెయింటైన్ చేశాడు. అయితే.. పైకి ఎంత మొరటుగా కనపడినా స్వభావం పరంగా సున్నితత్వాన్ని కొన్ని సన్నివేశాల్లో చూపిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా అదితిరావుతో గొడవపడే సన్నివేశాల్లో రెండు వెర్షన్స్ లో మాట్లాడే కార్తీ నటన చూసి ఆశ్చర్యపోనివారు ఉండరు. ఇక యుద్ధ ఖైదీగా కార్తీ చూపిన వేరియేషన్ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అదితిరావు పాత్ర కథలో చాలా కీలకం. పైకి సుకుమారిలా కనిపిస్తునే జగమొండిగా బిహేవ్ చేసే లీలా పాత్రలో ఒదిగిపోయింది అదితి. కార్తీతో రొమాన్స్ సీన్స్ లో అదితి-కార్తీల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది. కన్నడ “యూ టర్న్” ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ ఈ చిత్రంలో గిరిజ పాత్రలో ఓ వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్ తో అలరించింది. ఆర్.జె.బాలాజీ కామెడీ పండించాలని చేసిన ప్రయత్నాలు దాదాపుగా వికటించాయి.

సాంకేతికవర్గం పనితీరు : కృష్ణుడి వేణు గానానికి గోపికలు మైమరచి ఆడినట్లుగా.. రెహమాన్ సంగీతం, నేపధ్య సంగీతంలో ప్రతి ప్రేక్షకుడు ఓలలాడడం ఖాయం. రెహమాన్ సమకూర్చిన పాటలకు మణిరత్నం మార్క్ క్లాసిక్ రొమాన్స్ తోడవ్వడంతో.. “మైమరపా..” పాటను చూస్తూ నిజంగానే మైమరచిపోతారు ప్రేక్షకులు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ కారణంగా ప్రతి ఫ్రేమ్ ఓ రవివర్మ పెయింటింగ్ లా అందంగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మంచు మధ్యలో జీప్ లో కార్తీ-అదితిరావులు ముద్దాడే సన్నివేశాన్ని లాంగ్ షాట్ నుంచి క్లోజప్ కు ఎలివేట్ చేసిన తీరు కంటికింపుగానే కాక మనసుకు కూడా హాయిని కలుగచేస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఫ్రేమ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. లెహ్, కాష్మీర్ ప్రాంతాల్లోని సుందరమైన లొకేషన్స్ ను ఇంకాస్త అద్భుతంగా తెరపై ప్రెజంట్ చేసిన తీరు సినిమా అభిమానులకు కన్నులపండుగగా ఉంటాయి. ఎడిటింగ్ బాగుంది కానీ.. ఎలివేషన్ షాట్స్ ఎక్కువయ్యాయి. దానివల్ల సినిమా లెంగ్త్ పెరిగింది. కార్తీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ల్యాగ్ ఎక్కువయ్యింది. పేరలల్ స్క్రీన్ ప్లే వల్ల కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయ్యింది.

దర్శకుడిగా మణిరత్నం నైపుణ్యానికి పేరు పెట్టే టెక్నీషియన్ కానీ విశ్లేషకుడు కానీ ఇంకా పుట్టలేదు. ఆయన కెమెరా యాంగిల్స్ ద్వారా ఎలివేట్ చేసే ఎమోషన్స్ ప్రేక్షకుల మనసుల్లోనే కాదు సినిమా చరిత్రలోనూ చిరస్థాయిగా నిలిచిపోతాయి. కానీ.. ఒక రచయితగా మణిరత్నం పట్టు తగ్గుతూ వస్తోంది. “ఒకే బంగారం” కూడా కథ కంటే పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, రెహమాన్ సంగీతం సినిమాని ఎక్కువగా కాపాడాయి. మూల కథను హాలీవుడ్ సినిమా “బిహైండ్ ది ఎనిమీ లైన్స్” నుంచి స్పూర్తి పొందగా.. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తమిళ సినిమా “మరియన్”ను తలపిస్తుంది. “చెలియా” సినిమాతో దర్శకుడిగా మణిరత్నం పాస్ అయ్యి ఉండొచ్చు కానీ.. ఒక రచయితగా మాత్రం ఫెయిల్ అయ్యాడు.

విశ్లేషణ : కార్తీ-అదితిరావ్ ల మధ్య కెమిస్ట్రీ, యుద్ద సన్నివేశాలు మినహా ఆకట్టుకొనే అంశం మరొకటి లేకపోవడం సినిమాలో మైనస్. సో, ఓవరాల్ గా “చెలియా” మణిరత్నం అభిమానులకు మినహా కమర్షియల్ సినిమా లవర్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు!

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus