ఈ సినిమాలకు చిన్నారులే ప్రాణం!

  • November 14, 2017 / 04:22 AM IST

సినిమాల్లో చిన్నారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి చుట్టూ కథ నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన క్షణం, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, సుప్రీం, పోలీసోడు (తేరి) చిత్రాల్లో పిల్లలు అద్భుతంగా నటించి.. విజయానికి దోహద పడ్డారు..

సిసింద్రీ
అక్కినేని మూడో తరం హీరో, యువ సామ్రాట్ నాగార్జున వారసుడు అఖిల్ తన తొలి ఏటనే తెర పైన కనిపించాడు. బుజ్జి హీరో గా సిసింద్రీలో అల్లరి చేసాడు. నవ్వులు పండించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కిడ్నాప్ అయినా ఏడాది వయసున్న బాబు ఇంటికి ఎలా చేరాడు? అనే కథ సిసింద్రీ చుట్టూనే తిరుగుతుంది.

జై చిరంజీవ
సత్యనారాయణ మూర్తి (చిరంజీవి) కి తన కోడలు లావణ్య అంటే ప్రాణం. ఆమెను చంపేస్తారు. ఆ హంతకులను చంపటానికి మెగాస్టార్ చేసే ప్రయత్నమే జై చిరంజీవ సినిమా. పాప కనిపించేది కొంత సమయమే అయినా ఆమె కోసమే కథ నడుస్తుంది..

డాడీ
మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడే డాడీ అని పేరుతో సినిమా చేయడానికి అంగీకరించారు. ఇతరులకు సాయం చేయబోయి తన కూతురిని కోల్పోతాడు రాజ్ కుమార్ (చిరు). దీంతో తన భార్యకు కూడా దూరమవుతాడు. ఇందులో బేబీ అనుష్క మల్హోత్రా అక్షయ పాత్రలో ఆకట్టుకుంది. చివరగా ఐశ్వర్యగా కూడా కనిపిస్తుంది. తండ్రి కూతుళ్ళ ప్రేమకు ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలిచింది.

నాన్న
తండ్రి కూతుళ్ల ప్రేమకు అద్దం పట్టిన మరో సినిమా నాన్న. తెలుగు తమిళ్ భాషల్లో విడుదలైన ఈ మూవీ మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మానసికంగా ఎదగని తండ్రిగా విక్రమ్( కృష్ణ), తండ్రిని బిడ్డలా చూసుకునే కూతురిగా బేబీ సార (లావణ్య) అద్భుత నటనతో కంట తడి పెట్టించారు. కూతురు లావణ్య తనవద్దే ఉండాలని కృష్ణ పోరాడడమే సినిమా కథ. కోర్టులో కృష్ణ, లావణ్యల సైగల సంభాషణ, తండ్రిగా గెలిచినా, కూతురు భవిష్యత్ కోసం ఆమెను తాత వద్ద వదిలిపెట్టే సీన్లు చూసినప్పుడు ఎవరికైనా కన్నీరు ఆగదు.

క్షణం
లేటస్ట్ గా వచ్చిన థ్రిల్లర్ మూవీ క్షణం కూడా పాప చుట్టూనే తిరుగుతుంది. చిన్నారి కిడ్నాప్ అవ్వడంతో కథ మొదలై .. ఆమెను క్షేమంగా పట్టుకోవడం తో కథ ముగుస్తుంది. రవికాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పీ వీ పీ వారు నిర్మించారు. మంచి లాభాలను పొందారు.

క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ
నాని హీరోగా నటించిన క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రం లో పిల్లలు కీ రోల్ పోషించారు. ముగ్గురు పిల్లలను వాళ్ళ పేరంట్స్ వద్దకు క్షేమంగా చేర్చడమే కథ. ఈ పాత్రల్లో బేబీ నైని, బేబీ మోక్ష, మాస్టర్‌ ప్రథమ్‌ లు చక్కగా నటించి.. ఒక వైపు నవ్వులు.. మరో వైపు టెన్షన్ ను పుట్టించి హిట్ చేయించారు. చిన్న పాప, ఆమె చేతిలోని బొమ్మ చుట్టూ అల్లుకున్న సీన్స్‌ బాగా నవ్విస్తాయి.

సుప్రీమ్
థియేటర్లలో విజయవంతంగా వంద రోజులకు పరుగులు తీస్తున్నసాయి ధరమ్ తేజ చిత్రం సుప్రీమ్. ఇందులోనూ బాల నటుడుకి అవకాశమిచ్చి సెంటిమెంట్ పండించారు. రాజన్ గా మాస్టర్‌ మిఖాయిల్‌ గాంధీ చేసిన యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటుడితో భయం లేకుండా నటించి గాంధీ మెప్పించాడు. ఈ సినిమాలోను ఈ చిన్నారి పాత్రే కీలకం.

పోలీసోడు
తమిళ చిత్రం ‘తెరి’ తెలుగులో ‘పోలీసోడు’ అలియాస్‌ ‘పోలీస్‌” గా రిలీజ్ అయింది. సినిమా హిట్ సాధించక పోయినా హీరో విజయ్, కూతురు బేబీ నైనిక మధ్య సీన్లు, వారిద్దరి సంభాషణలు ఆకట్టుకున్నాయి. పాప పాత్రను పెట్టడంతో ఈ చిత్రానికి కొత్త లుక్ ని తీసుకొచ్చింది.

కిక్

మాస్ మహారాజ రవి తేజ హిట్ సినిమాల్లో కిక్ ఒకటి. ఇందులో కిక్ ఉండాలని విభిన్న పనులు చేసే కళ్యాణ్ ( రవితేజ) పాత్ర అందరికి నచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను రక్షించాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బడాబాబుల సొమ్ములను కొట్టేస్తుంటాడు. ఈ చిత్రంలో బేబీ యాని నేహా గా నటించింది. ఈ చిన్నారితో పరిచయం ఏర్పడిన తర్వాత రవితేజకు ఒక గోల్ అంటూ ఏర్పడుతుంది. అక్కడ నుంచి సినిమా మాస్ మహారాజ సాహసాలతో సాగిపోతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు బాలీవుడ్ వారిని ఆకట్టుకుంది. అక్కడ ఈ సినిమాను రీమేక్ చేసి సల్మాన్ ఖాన్ హిట్ కొట్టాడు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus