తెరపైకి మెగాస్టార్ – మాటల మాంత్రికుడి కాంబినేషన్..!

దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘ఖైదీ నెం 150’ సినిమాతో మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా వినాయక్ తెరకెక్కిస్తోన్న ‘ఖైదీ నెం 150’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి పండగకు విడుదల కానున్న సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే చిరు తర్వాతి సినిమాలపైనా చర్చలు జోరుగా సాగుతున్నాయి.బోయపాటి దర్శకత్వంలో చిరు 151వ సినిమా ఉంటుందని, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తారని వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా 152వ సినిమా గురించి గుసగుసలు మొదలయ్యాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిరుని డైరెక్ట్ చేయనున్నారట. చిరు హీరోగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన అశ్వినిదత్ ఈ సినిమాతో మళ్ళీ నిర్మాణ రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ‘అతడు’ సినిమా తీసేముందు 2005లో మెగాస్టార్ నటించిన ‘జై చిరంజీవ’ సినిమాకి కథ, మాటలు అందించిన త్రివిక్రమ్ అటుపై దర్శకుడిగా బిజీ అయిపోయారు. త్రివిక్రమ్ డైరెక్టర్ గా నిలదొక్కుకునే సరిని చిరు రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. లేదంటే ఈపాటికే వీరి కాంబినేషన్లో సినిమా వచ్చేదన్నది మెగా వర్గీయుల మాట. పైగా త్రివిక్రమ్ అంటే చిరుకి గురి ఎక్కువే. అంచేత ఈ కాంబినేషన్ లో సినిమా అంటే కొట్టి పారేసేదేం కాదు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus