మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది. ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుండగా.. మూవీ యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. కాగా, భోళా శంకర్ చిత్రం కోసం హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ తమన్నా భాటియా, కీర్తి సురేశ్, దర్శకుడు మెహర్ రమేశ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కమెడియన్ గెటప్ శీను వారిని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో చిరంజీవి, కీర్తి సురేశ్‌కు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.
వీటికి చిరంజీవి (Chiranjeevi) తన మార్క్ చతురతతో అద్భుతంగా సమాధానాలు చెప్పారు. భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్ర పోషించారు స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్. ఈ నేపథ్యంతో తర్వాతి సినిమాల్లో చిరంజీవి పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ వస్తే చేస్తారా అని కీర్తి సురేశ్‌ను ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు గెటప్ శీను. దీనికి కీర్తి సురేశ్ సమాధానం ఇచ్చారు. తప్పకుండా చేస్తానని అన్నారు. అయితే, భోళా శంకర్‌తో పోలిస్తే క్యారెక్టర్ విభిన్నంగా ఉండాలని కీర్తి అన్నారు.
ఈ ప్రశ్నకు ఆమె కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించడంతో చిరంజీవి కల్పించుకున్నారు. “రేప్పొద్దున హీరోహీరోయిన్లుగా ఛాన్స్ వస్తే చేస్తారా.. అనే డౌట్ నీకు (గెటప్ శీను) ఎందుకు వచ్చింది. ఈ సినిమాలో చెల్లిగా చేస్తే.. రేపు చెలిగా చేయకూడదా.. సఖిగా చేయకూడదా.. చేస్తాం” అని చిరంజీవి అన్నారు. సీనియర్ ఎన్టీఆర్, మహానటి సావిత్రి గురించి గుర్తు చేశారు చిరూ. “రక్త సంబంధం సినిమాలో మహానటి సావిత్రి, రామరావు గారు అన్నా చెల్లెలిగా చేసి.. ఆ తర్వాత సుఖదుఃఖాలు లాంటి చిత్రాల్లో అలా (హీరోహీరోయిన్లు) చేశారు.
ఆటోమేటిక్‌గా యాక్సప్టెన్స్ వస్తుంది” అని చిరంజీవి అన్నారు. “ఆడియన్స్ ఏ సినిమాకు ఆ సినిమాగానే చూస్తారు తప్ప.. ఆ సినిమాలో అన్నా చెల్లెళ్లుగా చేశారు కదా అని.. లైఫ్‌టైమ్ అన్నా చెల్లెళ్లుగా చేయకండి. నాకు ఇష్టం లేదు” అని చిరంజీవి అన్నారు. సరదాగా కీర్తి సురేశ్ చేయి పట్టుకొని నవ్వారు. అది సినిమా వరకే అని చిరంజీవి అన్నారు. కీర్తి సురేశ్ కూడా నవ్వుతూ ‘ఎస్.. నేను కూడా’ అని అన్నారు. మొత్తంగా ఈ చిట్‌చాట్ మొత్తం సరదాగా సాగింది.