ఈ మాటను టాలీవుడ్ స్టార్ హీరోలు బాగా నమ్ముతారు అంటుంటారు. వాళ్లు స్వతహాగా కావాలనే అలా నమ్ముతారా. లేకపోతే ఆ జోనర్ నుండి బయటికొస్తే ప్రేక్షకులు చూడరు అనే భయమా? అనేది తెలియదు కానీ. వయసు మీద పడుతున్నా, ఇంకా మాస్ హీరో లెక్కన డ్యాన్స్‌లు, ఫైట్లు, ఎలివేషన్ సీన్లు అనుకుంటూ ముందుకెళ్లకూడదు. ఈ మాట మేం అన్నది కాదు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో కొంతమంది హీరోలు చేసి చూపించారు. ఇప్పుడు మన దగ్గర హీరోలు కూడా ఈ పని చేయాల్సిందేనా? ప్రస్తుతం దీనిపైనే చర్చ నడుస్తోంది.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఆధ్యుడు అంటే చిరంజీవే అని చెప్పాలి. ఆయన 40 ఏళ్ల కెరీర్‌లో చూడని విజయం లేదు, అందుకోని రికార్డులు లేవు. అయితే సినిమా మీద ప్రేమతో ఇంకా 67 ఏళ్లు వచ్చినా కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. పరిస్థితులు మారుతున్నా, ప్రేక్షకుల ఆలోచన మారుతున్నా ఇంకా చిరంజీవి పాత రోజులు తరహాలోనే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దీనికి ఓ కారణం ‘ఆచార్య’ ఫలితం అయితే, రెండో కారణం కొత్త సినిమాల లుక్‌లు, వీడియోలకు వస్తున్న రెస్పాన్స్.
‘ఆచార్య’లో చిరంజీవి పాత్ర విషయంలో ఫ్యాన్స్ కానీ, ప్రేక్షకులు కానీ సంతృప్తి పడలేదు. ఏదో మిస్ అయ్యింది అనుకున్నారు. మొత్తానికి పాత్ర చిత్రణ విషయంలోనే తేడా కొట్టింది. ఆ విషయంలో దర్శకుడిని ఎంత అనాలో, దానికి ఓకే చెప్పిన చిరంజీవి కూడా అంతే బాధ్యుడు. ఇప్పుడు చేస్తున్న రీమేక్ సినిమాలు ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ పాత్రల విషయంలో కాస్త కొత్తదనం కనిపిస్తున్నా.. రీమేక్‌లు అనే మాట మనసు చివుక్కుమనేలా చేస్తోంది. అలాంటి కథల్ని ఆయన ఎంచుకోవడానికి ‘ఇంకా నేను మాస్ హీరోనే’ అని అనుకోవడమే అంటున్నారు.
ఈ సినిమాల తర్వాత చిరు చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు) కూడా మాస్ అంశాల మేళవింపు అంటున్నారు. ఈ ఏజ్‌లో అంత మాస్ పనికొస్తుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. తమిళంలో రజనీకాంత్ ఇలాంటి ప్రయత్నాలు చేసి వరుసగా పరాజయాలు పాలవుతున్న విషయం చూస్తున్నాం. ఇప్పుడు చిరంజీవి కొత్తగా ఆలోచించి కథలు, కాన్సెప్ట్‌లు చూసుకోకపోతే కష్టమే అంటున్నారు. ‘గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’ లాంటివి హిట్ అయితే ప్రేక్షకుల ఆలోచన మారే అవకాశమూ ఉంది.
అయితే ఇక్కడో సమస్య ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఓ హీరోను ఒకేలా చూడటానికి ఇష్టపడ్డారు అని అనొచ్చు. ఉదాహరణకు అదే ‘ఆచార్య’ను తీసుకుంటే.. అందులో చిరంజీవి పాత్రకు హీరోయిన్ లేదు, సరైన పాటలు లేవు, స్టెప్పులు లేవు అని అనే వారూ ఉన్నారు. ఆయన రెగ్యులర్ పాత్రలకు దూరంగా ట్రై చేస్తే తీసుకోలేకపోయారు. మరిలాంటప్పుడు ప్రయోగం చేయడానికి ఆయన ముందుకు రావడానికి జంకుతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ‘సైరా’ దగ్గరకి వచ్చినప్పుడు కూడా ఇంచుమించు ఇలానే అన్నారు. అయితే చిరు అలవాటు చేస్తే జనాలు అలవాటు పడతారు. సో.. చిరంజీవి ఓసారి ఆలోచించాల్సిందేనా?
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?