ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దశాబ్ధాలపాటు హీరోగా “నంబర్ ఒన్” పొజీషన్ లో కొనసాగడంతోపాటు అసంఖ్యాక అభిమాన గణాన్ని సొంతం చేసుకొన్న ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. పరిచయం అనేది అవసరం లేని ఈ పేరును వెండితెరపై చూసుకొని దాదాపు 8 ఏళ్లవుతోంది. మధ్యలో ఓ రెండు సినిమాల్లో మెరిసినప్పటికీ.. అభిమానులకు ఆ మెరుపు చూడలేదు. చిరంజీవిని మళ్ళీ ఒక్కసారి పూర్తిస్థాయి హీరోగా చూసుకోవాలన్న అభిమానుల కోరికను మన్నించి మెగాస్టార్ నటించిన సినిమా “ఖైదీ నంబర్ 150”. చిరు తనయుడు చరణ్ నిర్మాతగా మారి రూపొందిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన చరణ్ తో మూడుసార్లు జతకట్టిన అందాల చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించడం విశేషం. ఇంకో రెండ్రోజుల్లో “ఖైదీ నంబర్ 150” ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భాన్ని పురస్కరించుకొని చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..!!
అభిమానం ఏమాత్రం తగ్గలేదు..
సినిమాలకు స్వస్తి చెప్పి “ప్రజారాజ్యం” స్థాపించినప్పుడు తిరుపతి వేడుకకు ఎంత మంది అభిమానులు హాజరయ్యారో.. మొన్న జరిగిన “ఖైదీ నంబర్ 150” ప్రీ రీలీజ్ ఈవెంట్ కి అంతకుమించిన జనం హాజరయ్యారు. లోపలికి వచ్చిన వారి సంఖ్యే రెండున్నర లక్షలని పోలీస్ శాఖ వారు తెలిపారు. సో, నా మీద జనాలకు ఉన్న అభిమానం పెరిగిందే కానీ తగ్గలేదు అనిపించింది.
ఎప్పుడూ బాధపడలేదు..
“సినిమాల్లో మాంచి ఫామ్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళారు కదా బాధ అనిపించలేదా?” అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. నేనెప్పుడు ఆ విషయం గురించి పట్టించుకోలేదు. నేను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ అభిమానుల కోసం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాను. సో, ఏ విషయం బాధపడాల్సిన అవసరం నాకు రాలేదు.
“కత్తి” కంటే మంచి కథ దొరకలేదు కాబట్టే..
ఎంతో ప్రతిష్టాత్మకమైన 150వ సినిమా కోసం ఒక తమిళ రీమేక్ ను ఎందుకు ఎంచుకొన్నారంటూ కొందరు ప్రశ్నిస్తుండగా.. ఇంకొందరు విమర్శిస్తున్నారు. నిజానికి తొలుత కొన్ని వందల సంఖ్యలో కథలు విన్నాను. కథలో పట్టు ఉన్నా.. నా రీ ఎంట్రీ తగ్గ కథ కాకపోవడంతో వాటిని వెనక్కి నెట్టి.. ఎంటర్ టైన్మెంట్ తోపాటు సమాజానికి మంచి సందేశాన్నిచ్చే అంశాలు పుష్కలంగా ఉన్న “కత్తి”ని ఎంచుకోవడం జరిగింది.
కొన్ని మార్పులు చేశాం..
“కత్తి” ఒరిజినల్ వెర్షన్ చాలా సీరియస్ గా సాగుతుంటుంది. ఎంటర్ టైన్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే.. తెలుగులో కొన్ని మార్పులు చేసి బ్రహ్మానందం-రఘుబాబుల కాంబినేషన్ లో కామెడీ ఎపిసోడ్స్ ను యాడ్ చేశాం. అలాగే.. స్క్రీన్ ప్లే విషయంలోనూ కొన్ని మార్పులు చేయడం జరిగింది, దానివల్ల కథనంలో వేగం పెరిగింది.
కొడుకుగా కంటే నిర్మాతగా ఎక్కువ బాధ్యత తీసుకొన్నాడు..
సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలి అనుకొన్నప్పుడు చరణ్ నాకు ట్రైనర్ గా మారిపోయాడు. నేను ఇప్పుడు సినిమాలో ఇంత యంగ్ గా కనిపిస్తున్నానంటే అందుకు కారణం ఒక ఫిట్ నెస్ ట్రైనర్ గా చరణ్ తీసుకొన్న జాగ్రత్తే. అలాగే.. సినిమా ప్రారంభమవ్వగానే నిర్మాతగా మారిపోయాడు. తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే “ఖైదీ నంబర్ 150” నిర్మాణం పనులు జాగ్రత్తగా చూసుకొన్నాడు. నిజం చెప్పాలంటే.. ఒక కొడుకుగా కంటే ఒక నిర్మాతగా చరణ్ ఎక్కువ బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు.
అసలు క్లాప్ బోర్డే కనబడలేదు..
సినిమాలో నటించి పదేళ్ళయ్యిందేమో.. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేశాయి. అసలు షూటింగ్ లో నాకు “క్లాప్ బోర్డే” కనపడలేదు. నటించడం కొత్త కాకపోయినప్పటికీ.. పద్ధతుల్లో మార్పును అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది అంతే. అయితే.. అప్పటికీ ఇప్పటికీ నాలో మారనిది ఏంటంటే.. సినిమా విడుదలకు ముందు ఉండే భయం ఒక్కటే.
నాగబాబు మాటల్లో నాకు తప్పు కనపడలేదు..
ప్రతి వ్యక్తి తనదైన శైలిలో రియాక్ట్ అవుతుంటాడు. నాగబాబు కాస్త ఎగ్రెసివ్, సో వర్మ విషయంలో అలా కోపంగా రియాక్ట్ అయ్యాడు. అయితే.. “అక్కుపక్షి, సన్నాసి” లాంటి పదాల వాడకం కాస్త అభ్యంతకరమే. అది నాగబాబు ఇష్టం.
వాటికి రియాక్ట్ అవ్వాలనుకోను..
వర్మ అనే కాదు ఎవరైనా నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసహ్యంగా మాట్లాడడం లాంటివి చేసినప్పుడు అవి నా దృష్టికి వచ్చినా నేను పెద్దగా పట్టించుకోను. నా వరకూ అలాంటి విషయాలకు రెస్పాండ్ అయితే.. అలా మాట్లాడిన వారికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అవుతుంది. నాకు అది ఇష్టం ఉండదు, వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండడమే వారికి నేనిచ్చే సమాధానం.
వర్మతో నాకు విబేధాలేమీ లేవు..
వర్మను ఒక దర్శకుడిగా నేను గౌరవిస్తాను. అతడి రంగంలో వర్మ చాలా గొప్పోడు. ప్రత్యేకించి నాకు వర్మతో విబేధాలేమీ లేవు. ఆయన ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు అనేది నాకు అనవసరమైన విషయం.
151,152 కూడా రెడీ..
నా 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉంటుంది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో 152వ సినిమా ఉంటుంది. ఇవి కాకుండా “ఉయ్యలవాడ నరసింహారెడ్డి” కథను కూడా హోల్డ్ లో పెట్టడం జరిగింది. అయితే.. ఆ సినిమా ఎప్పుడు చేస్తా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
వాటి ప్రస్తావన లేదు..
“కత్తి” సినిమాలో చాలా చోట్ల రాజకీయ పరమైన అంశాల మరియు కొన్ని కుంభకోణాలను ప్రస్తావించడం జరిగింది. తెలుగు వెర్షన్ లో అలాంటి వాటికి తావు లేకుండా కేవలం రైతు సమస్యలపైనే శ్రద్ధ చూపాం. మన భారతదేశంలో ఎంతమంది రైతులు అప్పుల బాధ కారణంగా, నీటి కొరత కారణంగా ఊరి వేసుకొని, పురుగుల మందు తాగి ఆత్మ హత్యలు చేసుకొంటున్నారు అనే వంటి అంశాల మీద ప్రత్యేక దృష్టి సారించాం.
ఎవరి ప్రత్యేకత వారిదే..
చరణ్, అర్జున్, వరుణ్, ధరమ్ తేజ్, నీహారిక ఇలా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వ్యవహారశైలీ ఉంది. చరణ్ లో కష్టపడే తత్వం, అల్లు అర్జున్ లో చలాకీతనం, వరుణ్ తేజ్ లోని నిబద్ధత, సాయిధరమ్ తేజ్ లోని చిలిపితనం, నీహారికలోని క్యూట్ నెస్ నాకు బాగా నచ్చుతాయి.
Interview by Dheeraj Babu P
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.