కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ తన 152వ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి అనుకుంటున్నట్టు మెగాస్టార్.. ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో తెలియజేసారు. అయితే ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుండీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉండటం గమనార్హం. ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయాలన్నది మెగాస్టార్ ప్లాన్. అందుకు తగినట్టుగా ఈ చిత్ర నిర్మాతలు అయిన నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లు … అన్ని వ్యవహారాలను చక్కబెట్టాలని అనుకున్నారు. అయితే ఈ చిత్రంలో రాంచరణ్ ఓ పాత్ర చెయ్యాల్సి ఉంది.
కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లేటవ్వడం వల్ల.. రాజమౌళి అడ్డుకట్ట వేశారు. దీంతో మహేష్ బాబుని సంప్రదించారు. ఆయన ఓకే చెప్పాడు కానీ 30 కోట్లు పారితోషికం అడిగాడు. దీంతో మెగాస్టార్ షాక్ కి గురయ్యి.. రాజమౌళిని కలిసి చరణ్ తోనే ఆ పాత్రను చేయించడానికి రెడీ అయ్యారు. అలా డిసైడ్ అయిన రెండు రోజులకే హీరోయిన్ త్రిష ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ ను వెతికే పనిలో టీం బిజీగా ఉన్నారు. అంతా బానే ఉంది అనుకున్న టైములో ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆపెయ్యాల్సి వచ్చింది. వీటన్నిటి బట్టి చూస్తుంటే.. ఆగష్టు లో ఈ చిత్రం విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీని పై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. బహుశా ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రకటిస్తారేమో చూడాలి..!