కంగనా రనౌత్ కి (Kangana Ranaut) చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కంగనపై చెంపపై కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గురువారం నాడు మధ్యాహ్నం పూట ఢిల్లీకి బయలుదేరిన కంగనా.. చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ కొరకు వెళ్తుంది. సరిగ్గా అప్పుడే ఈ సంఘటన చోటు చేసుకుంది. గతంలో సాగు చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా కంగనా కామెంట్లు చేసింది.
అయితే ఇప్పుడు ఆమె ఎంపీ.హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మండి నుండి పోటీ చేసి ఘన విజయం సాధించింది. అలాంటి కంగనకి ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం షాకించే విషయమే అని చెప్పాలి. ఇక ఈ సంఘటన పై కంగనా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “నేను క్షేమంగానే ఉన్నాను.! సెక్యూరిటీ చెకింగ్ వద్ద ఈ ఘటన జరిగింది.
చెకింగ్ పూర్తయ్యాక పాస్ కోసం వేచి చూస్తుండగా.. సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ నా వైపు వచ్చి కొట్టడం.. అలాగే దూషించడం జరిగింది. ఎందుకు ఇలా చేశారు అని నేను ప్రశ్నించాను. ‘నేను రైతులకు మద్దతుదారు’ అంటూ ఆమె చెప్పింది. ఈ సంగతి ఎలా ఉన్నా పంజాబ్లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం పై కూడా దృష్టి పెట్టాలి” అంటూ కంగనా చెప్పుకొచ్చింది.
ఇక ఈ ఘటన తర్వాత ఢిల్లీ చేరుకున్న కంగనా అక్కడ సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులను కలిసి ఈ విషయం పై డిస్కస్ చేసిందట. దీని కోసం ఓ టీంని కూడా వారు నియమించినట్టు తెలుస్తుంది. ఆ కానిస్టేబుల్ కుల్విందరుని విచారణ కొరకు సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి పంపించినట్టు తెలుస్తుంది.