ప్రముఖ అస్సామీ గాయకుడు జుబెన్ గార్గ్ ఇటీవల సింగపూర్‌లో దురదృష్టవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. స్కూబా డైవింగ్ చేస్తూ జుబెన్ ప్రాణాలు విడిచినట్లుగా అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ మృతి వెనుక ఏదో మిస్టరీ ఉందని.. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఈ విషయం, చర్చ ఇక్కడితో ఆగేలా లేదు. ఎందుకంటే జుబెన్ మరణ ధ్రువీకరణ పత్రంపై ఆయన విచారణ చేయిస్తా అని చెబుతున్నారు.
జుబెన్ గార్గ్ మృతిపై వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ మరణ ధ్రువీకరణ పత్రంపై దర్యాప్తు చేయిస్తామని వ్యాఖ్యానించారు. మరణ ధ్రువీకరణపత్రంపై అనుమానాలు ఉన్నాయని చెప్పిన ఆయన.. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించనున్నట్లు తెలిపారు. సింగపూర్ హైకమిషన్ పంపిన మరణ ధ్రువీకరణ పత్రంలో జుబెన్ నీటిలో మునిగిపోవడం వల్ల చనిపోయినట్లు ఉందని సీఎం తెలిపారు.
అయితే ఆ నివేదిక పోస్టుమార్టం కాదని, అందుకే వీలైనంత తర్వగా పోస్టుమార్టం చేయించి రిపోర్టును ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఆ పత్రాలను సీఐడీకి పంపుతామని, పూర్తిస్థాయిలో విచారణ జరిగేలా చూస్తాం అని హిమంత బిశ్వశర్మ చెప్పారు. ఈ మేరకు ఆయన సింగర్ జుబెన్ అభిమానులకు హామీ ఇచ్చారు. ఆదివారం అస్సాంలోని గువాహటిలో దాదాపు లక్ష మంది అభిమానులు జుబెన్‌కు నివాళులర్పించారు. ఆయన మృతదేహం ఉంచిన సరూసజయ్ స్టేడియానికి భారీగా అభిమానులు తరలివచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు స్కూబా డైవింగ్ చేస్తుండగా జుబిన్ మరణించినట్లు వచ్చిన వార్తలను నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకులు ఖండించారు. విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబెన్‌ను సింగపూర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారని.. అక్కడే ఆయన మృతి చెందారని నిర్వాహకులు అంటున్నారు.