ఓ సినిమారిలీజ్ సమయంలో ఎక్కడో అమెరికాలో షో ముందుపడి.. ఆ తర్వాత చాలా గంటల తర్వాత మన దగ్గర షో పడితేనే ‘ఇదేంటి ఇలా అక్కడ ముందు వేసేయడం’ అని అంటున్న రోజులివి. పక్క థియేటర్‌లో ఓ పది నిమిషాల ముందు షో పడుతుంది అంటే అక్కడే చూద్దాం అనుకుంటారు హీరోల ఫ్యాన్స్. అలాంటిది ఓ నాలుగు గంటల ముందు పక్క రాష్ట్రంలో సినిమా ప్రీమియర్ షో పడుతుంది అని అంటే ఊరుకుంటారా చెప్పండి. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పరిస్థితి ఇదే. అందుకే వివిధ వర్గాలు, సోర్స్‌ల ద్వారా ఆ విషయం పవన్ కల్యాణ్‌కి చేరవేశారు అని తెలుస్తోంది.
పైన చెప్పిందంతా ‘ఓజీ’ సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోని తెలంగాణలో ముందు రోజు అంటే 24న రాత్రి 9 గంటలకు షెడ్యూల్ చేశారు. త్వరలో టికెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని సమాచారం. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పడదు. ఎందుకంటే 25న అర్ధరాత్రి ఒంటి గంటకు అక్కడ ప్రీమియర్ షో వేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లకు కారణమైంది.
తెలంగాణ తరహాలోనే మన దగ్గర కూడా సినిమాను ముందు రోజే వేసేద్దాం.. అంటూ పవన్ కల్యాణ్‌కి, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌కి రిక్వెస్ట్‌లు వచ్చాయట. దీంతో ఆంధ్రలో కూడా ముందు రోజే ప్రీమియర్ షో పడేలా కొత్త జీవో ఒకటి ఈ రోజు రావొచ్చు అని తెలుస్తోంది. టికెట్ ధర అంతే ఉండి తేదీ మాత్రం ముందు రోజుకు తీసుకొస్తారని సమాచారం. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ చేస్తే, ఆయన సినిమా టీమ్ రిక్వెస్ట్ చేస్తే ఏపీ ప్రభుత్వంలో కాని పనులు ఉంటాయా చెప్పండి.