కోకో కోకిల

లేడీ సూపర్ నయనతార టైటిల్ పాత్రలో నటించిన డార్క్ హ్యూమర్ ఫిలిమ్ “కోకో”. తమిళంలో గతవారం విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో “కోకో కోకిల” పేరుతో అనువదించి నేడు (ఆగస్ట్ 31)న విడుదల చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సొంతం చేసుకొంది. మరి ఈ డార్క్ కామెడీ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఎంటర్ టైన్ చేయగలదో చూద్దాం..!!

కథ : తల్లి (శరణ్య)కు లంగ్ క్యాన్సర్ రావడంతో ఆమెకు ఆపరేషన్ ఖర్చుల కోసం తాను చేసే మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోదని గ్రహించి.. అదే ఊర్లో సీక్రెట్ గా డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా జాయినవుతుంది కోకిల (నయనతార). కోకిల అమాయకురాల్లా కనబడడంతో పోలీసులు ఆమెను పెద్దగా పట్టించుకోరు. అదే అదునుగా ఆమె ద్వారా కేజీలు కొద్దీ డ్రగ్స్ తరళిస్తుంటారు.

అయితే.. కోకిల కావాలని చేయని ఓ తప్పు కారణంగా 100 కేజీల డ్రగ్స్ ను ఒకేసారి వేరే ప్రదేశానికి చేర్చవలిసి వస్తుంది. ఆ సమయంలో కోకిల కుటుంబం మొత్తం (తల్లి, తండ్రి, చెల్లి) కూడా ఈ డ్రగ్ మాఫియాలో భాగం కావాల్సి వస్తుంది. అలా కుటుంబం మొత్తం కలిసి మొదలెట్టిన ఈ డ్రగ్స్ తో ప్రయాణం చివరికి ఏ తీరానికి చేరింది? ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలేమిటి? వాటిని కోకిల తన యుక్తితో ఎలా నెట్టుకొచ్చింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు : నయనతార కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేం కానీ.. అండర్ ప్లే చేస్తూ కోకిల పాత్రలో జీవించింది నయనతార. ఆమె మొఖంలో అమాయకత్వం, చేతల్లో చురుకుదనం చూసి ఆశ్చర్యపోని ప్రేక్షకుడు ఉండడు. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనకు విరగబడి నవ్విన ప్రేక్షకుడే, కొన్ని సన్నివేశాల్లో షాక్ అవుతాడు. నయనతారలో ఇంత మంచి నటి ఉండగా.. ఆమెను కేవలం హీరోల పక్కన నిల్చోవడానికి లేదా డ్యాన్స్ చేయడానికి మాత్రమే ఎందుకు వినియోగిస్తున్నారు అని తనలో తాను ప్రశ్నించుకొంటాడు కూడా. అంతగా ప్రేక్షకులపై కోకిల పాత్రతో ఇన్ ఫ్ల్యుయన్స్ చేసింది నయనతార. నయనతార తర్వాత ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన నటి శరణ్య. నిన్నమొన్నటివరకూ అమాయకమైన అమ్మ పాత్రల్లో మెప్పించిన శరణ్య ఈ చిత్రంలో కంత్రీ తల్లిగా నటించిన విధానం సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.

నయనతార చెల్లిగా విజయ్ టీవి ఫేమ్ జాక్వలిన్, తండ్రిగా ఆర్.ఎస్.శివాజీలు పాత్రల్లో ఒదిగిపోగా.. శేఖర్ పాత్రలో యోగిబాబు థియేటర్లోని ప్రేక్షకుల్ని కడుపుబ్బ నక్కించాడు. ఓపెనింగ్ లో మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన యోగిబాబు సెకండాఫ్ లో చేసిన కామెడీ భలే ఉంటుంది. అలాగే కోకిల చెల్లెల్ని ప్రేమించే మోహన్ పాత్రలో చార్లెస్ వినోద్, మొట్ట రాజేంద్రన్, శరణవణన్ ల పాత్రలు సినిమాలో కీలకపాత్ర పోషించడంతోపాటు.. హాస్యాన్ని పంచాయి.

సాంకేతికవర్గం పనితీరు : నయనతార తర్వాత సినిమా సక్సెస్ లో ఎక్కువ శాతం క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే.. ముందుగా మెచ్చుకోవాల్సింది అనిరుధ్ సాంగ్స్ & బ్యాగ్రౌండ్ స్కోర్ ని. సినిమాలోని డార్క్ హ్యూమర్ ని తన నేపధ్య సంగీతంతో అనిరుధ్ ఎలివేట్ చేసిన విధానం ప్రశంసనీయం. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీని కూడా అప్రిషియేట్ చేయాలి. అలాగే నిర్మల్ ఎడిటింగ్ సినిమాకి మేజర్ ప్లస్.

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ రాసుకొన్న కథ చాలా సాదాసీదాగా ఉన్నప్పటికీ.. ఆ కథను నడిపిన విధానం, కొన్ని సన్నివేశాలను కంపోజ్ చేసిన తీరు మాత్రం అతడి ప్రతిభకు తార్కాణంగా నిలుస్తాయి. నయనతార & ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక రౌడీ గ్యాంగ్ ను హతమార్చే సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఆ సన్నివేశాన్ని ఎలాంటి అసభ్యత లేకుండా చాలా డీసెంట్ గా డీల్ చేసిన విధానం అమోఘం. అదొక్కటనే కాదు ప్రతి సన్నివేశంలోనూ కొత్తదనం, కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా ఉన్నా.. సదరు సన్న్విఏశాలను డీల్ చేసిన విధానం ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేయడమే కాదు పొట్ట పట్టుకొని నవ్వేలా చేస్తుంది.

విశ్లేషణ : చక్కని కథకు మంచి నటీనటులు, పర్ఫెక్ట్ టెక్నికల్ టీం & ఎక్స్ లెంట్ కెప్టెన్ (డైరెక్టర్) సెట్ అయితే ఆ అవుట్ పుట్ ఎలా ఉంటుంది అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ “కో కో కోకిల”. నయనతారలోని గ్లామర్ ను కాకుండా ఆమె పెర్ఫార్మెన్స్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకొని.. ప్రేక్షకుడు ఎక్స్ పెక్ట్ చేయలేని ట్విస్టులతో ఆద్యంతం రసవత్తరంగా సాగే “కో కో కోకిల” చిత్రాన్ని సరదాగా నవ్వుకుంటూ చూడొచ్చు.

రేటింగ్ : 3/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus