1979వ సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిండు నూరేళ్ళు’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అలీ… ఆ తర్వాత ‘సీతాకోక చిలుక’ వంటి ఇంకా కొన్ని చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అటు తర్వాత కమెడియన్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి హిట్లు కొట్టిన అలీ.. తనకు అచ్చొచ్చిన కామెడీని మాత్రం వదల్లేదు.
అలీకి మాత్రమే ఉన్న ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే.. ఇతన్ని ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేయలేడు. అలాగే అతనికి ఎటువంటి అవకాశం వచ్చినా స్వీకరించి ముందుకు సాగుతూ ఉంటాడు. సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెర పై హోస్ట్ చేస్తున్నాడు, సీరియల్స్ లో కూడా నటించాడు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చి ఇక్కడ కూడా పదవి పొందాడు. అంత గొప్ప చరిత్ర ఉన్న అలీకి లవ్ స్టోరీ కూడా ఉందా? బ్రేకప్ కూడా అయ్యిందా? అని మీరు హెడ్డింగ్ చూసి అనుకోవచ్చు.
ఈ విషయం పై అలీ స్పందిస్తూ.. “నన్ను ఎవరు చూసినా అలీ మనోడే అనుకుంటారు. అది చనిపోయే వరకు ఇలాగే ఉంటుంది. నేను మంచి చేస్తే అది నా పిల్లలకు కూడా వర్తిస్తుంది. నా కెరీర్లో మొట్టమొదటిసారిగా ‘సీతాకోకచిలుక’ చిత్రానికి అవార్డు అందుకున్నాను. ఆ తర్వాత హీరోగా చేసిన ‘యమలీల’ చిత్రం ఒక సంవత్సరం పాటు ఆడింది. నా కెరీర్లో 150 పైగా సినిమాల్లో నేను తాగుబోతు పాత్రలో కనిపించాను. సౌత్ లో ఉండే అన్ని భాషల్లోనూ నేను మాట్లాడగలను.ఇతరులు మాట్లాడే మాటలు కూడా అర్థం చేసుకోగలను.
నా కామెడీ అంటే పూరి జగన్నాథ్ కు చాలా ఇష్టం. కమెడియన్ కావాలని సినిమాల్లోకి వచ్చాను” అంటూ చెప్పిన అలీ అటు తర్వాత తన లవ్ స్టోరీ గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు. ‘మా ఇంటి దగ్గర ఓ అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె వర్షంలో తడుచుకుంటూ వెళ్లడం చూసి నా దగ్గర ఉన్న గొడుగు ఇచ్చాను. ఆ అమ్మాయి గొడుగు తీసుకుంది. తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు. అందుకే ఆ అమ్మాయితో విడిపోవాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.