11 మంది కొత్త హీరోలు, 4 కొత్త హీరోయిన్లు, ప్రేక్షకులకు పరిచయస్తులైన ఓ నలుగురు క్యారెక్టర్ ఆర్టిస్టులతో నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించి, తనకు కుదిరినంతలో భీభత్సంగా ప్రమోట్ చేసిన సినిమా “కమిటీ కుర్రాళ్ళు” (Committee Kurrollu) . అనుదీప్ దేవ్ సమకూర్చిన పాటల పుణ్యమా అని సినిమా ఇప్పటికే అందరి నోళ్ళల్లో బాగా నానింది. ఇక విడుదలైన ట్రైలర్ కూడా కంటెంట్ ఉన్న సినిమాగా “కమిటీ కుర్రాళ్ళ”ను ఎలివేట్ చేసింది. ఈవారం “కమిటీ కుర్రాళ్ళు” సినిమాది దాదాపుగా సోలో రిలీజ్ అనే చెప్పాలి. మరి ఈ కొత్త బృందం చేసిన ఈ చిన్న సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: సెల్ ఫోన్లు, యూట్యూబ్ లు లేని తరంలో పుట్టి.. స్వచ్ఛమైన పల్లె గాలి పీల్చి, హుందాతనం, చిలిపితనం కలగలిసిన స్నేహభావంతో పెరిగినోళ్లు “కమిటీ కుర్రాళ్ళు” . పుష్కరానికి ఒకసారి పల్లెటూర్లో జరిగే జాతర వైభోగాన్ని గ్రామ ప్రజలందరూ ఆస్వాదిస్తుంటే.. కొందరు మాత్రం కులం పేరుతో మనుషుల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ధికి వాడుకొంటుంటారు. ఈ తరుణంలో.. “కమిటీ కుర్రాళ్ళు” ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో సీనియర్ ప్రెసిడెంట్ బుజ్జి (సాయి కుమార్) (Sai Kumar) కి పోటీగా నిలబడతారు.
కమిటీ కుర్రాళ్ళు గెలిచారా? అసలు ఎలక్షన్స్ లో ఎందుకు నిలబడ్డారు? ఊర్లో జాతర సమయంలో జరిగిన గొడవ ఏమిటి? ఊరి మొత్తానికి అదొక మచ్చగా ఎందుకు మిగిలింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “కమిటీ కుర్రాళ్ళు” చిత్రం.
నటీనటుల పనితీరు: ఒక సినిమాలో అందరు నటీనటులు చక్కగా తమ తమ పాత్రల్లో ఒదిగిపోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. “కేరాఫ్ కంచరపాలెం” తరహా సినిమాల్లోనే ఇప్పటివరకు ఇది సాధ్యమైంది. ఇన్నాళ్ల తర్వాత “కమిటీ కుర్రాళ్ళు” మళ్ళీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసారు. హీరోహీరోయిన్లు మొదలుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. చాన్నాళ్ల తర్వాత సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మిని (Sri Lakshmi) ఓ చక్కని పాత్రలో చూడడం, ఆమె కొన్ని సన్నివేశాల్లో కళ్ళు చెమర్చేలా చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే.. 11 మంది హీరోల్లో సందీప్ సరోజ్, తినాథ్ వర్మ, ఈశ్వర్ రచిరాజు, యశ్వంత్ పెండ్యాల తమ నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విలిమం పాత్రలో ఈశ్వర్ మంచి హాస్యాన్ని కూడా పండించాడు. రాధ్య, తేజస్వి రావు, టీనా, విషిక, షన్ముఖిలు పల్లెటూరి పడుచులుగా లంగా ఓణీల్లో అందంగా కనిపించారు.
సాయికుమార్, గోపరాజు రమణ (Goparaju Ramana) , కంచర్లపాలెం కిషోర్ తదితర సీనియర్లు తమ సీనియారిటీని ప్రూవ్ చేసుకోగా.. ఎమోషనల్ సీన్స్ లో తన ఇమేజ్ కు భిన్నంగా నటించి మెప్పించిన నటుడు ప్రసాద్ బెహరా.
సాంకేతికవర్గం పనితీరు: అనుదీప్ దేవ్ (Anudeep Dev) సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పాలి. పాటలతో చిన్నప్పటి స్మృతులను గుర్తుచేస్తూ.. బ్యాగ్రౌండ్ స్క్రోర్ తో సినిమాలో లీనం అయ్యేలా చేశాడు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ లో రీ-రికార్డింగ్ తో పూనకాలు తెప్పించాడు. ఒక ఎమోషన్ ను ఎంత వరకు ఎలివేట్ చేయాలి, నిశ్శబ్దాన్ని ఎలా వినియోగించుకోవాలి వంటి విషయాలపై అనుదీప్ కు మంచి అవగాహన ఉండడం అతడ్ని త్వరలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారుస్తుంది.
రాజు ఎదురోలు (Raju Edurolu) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా క్యాప్చ్యూర్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ కథను ఎలివేట్ చేసేలా ఉంది.
దర్శకుడు యదు వంశీ ఎంచుకున్న కథలో కంటే కథనంలో మంచి బలం ఉంది. ప్రతి ఊర్లో జరిగే ఓ సాధారణ కథను.. 30 నుండి 40 ఏళ్ల వాళ్లకు తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా, 20 నుండి 30 ఏళ్ల గ్రామీణ యువతకి తమ ప్రస్తుతాన్ని గుర్తు చేసేలా తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకి హైలైట్. శివ, సుబ్బు, విలియం, సూర్య పాత్రలు మనలో, మన స్నేహితుల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఆ పాత్రల తాలుకు నిజాయితీని తెరపై పండించడంలో సఫలమయ్యాడు దర్శకుడు వంశీ.
ఫస్టాఫ్ ను హిలేరియస్ గా, స్వచ్ఛమైన గతాన్ని గుర్తు చేస్తూ నడిపించిన విధానం బాగుండగా.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషన్ పండించడం కోసం డ్రామాను మరీ ఎక్కువగా సాగదీయడం చిన్నపాటి మైనస్ గా మారింది. అలాగే.. కమిటీ కుర్రాళ్ళ ఎలక్షన్ క్యాంపైనింగ్ & డైలాగులు జనసేన మరియు పవన్ కళ్యాణ్ కార్యాచరణను గుర్తుకు తెస్తాయి. అందువల్ల మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి మరింతగా కనెక్ట్ అవుతారు. అలాగని.. ఇతర రాజకీయ పార్టీలను టార్గెట్ చేయడం గట్రా ఈ సినిమాలో జరగలేదు కాబట్టి లేనిపోని రాద్ధాంతాలకు తావు లేకుండాపోయింది. ఓవరాల్ గా దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు యదు వంశీ.
విశ్లేషణ: యువతకు రాను రాను రాజకీయాలంటే అసహ్యం పుట్టుకొస్తుంది, అందుకే రాజకీయ నేపథ్యం లేని ఏ ఒక్కరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేకుండాపోయింది. అయితే.. యువత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం ఎంత అవసరం అనే పాయింట్ ను ఎత్తుపొడుపులు లేకుండా నిజాయితీతో తెరకెక్కించిన విధానం “కమిటీ కురాళ్ళు” చిత్రానికి కీ పాయింట్. అలాగే.. పల్లెటూరి అల్లర్లు, చిన్నప్పుడు అమాయకంగా నమ్మేసిన కొన్ని అబద్దాలు, ఆలస్యంగా తెలుసుకున్న నిజాలు, అర్థం కాక వదులుకున్న స్నేహాలు, తెలియక పెంచుకున్న ద్వేషాలు, కులం కారణంగా జరిగిన గొడవలు.. ఇలా చాలా ఎమోషన్స్ ను తెరపై అందంగా చూపించిన సినిమా “కమిటీ కుర్రాళ్ళు”. సెకండాఫ్ లో వచ్చే చిన్నపాటి ల్యాగ్ ను ఇగ్నోర్ చేయగలిగితే సినిమా కచ్చితంగా థియేటర్లలో చూసి ఆస్వాదించగలిగే చిత్రమిది.