సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున వరుస ప్లాపుల వల్ల తన పంధా మార్చుకోవాల్సి వచ్చింది. ‘బంగార్రాజు’ ‘నా సామి రంగ’ వంటి సినిమాలు బాగానే ఆడినా మిగిలిన సినిమాల ఫలితాలు.. నాగార్జున స్టార్ డమ్ ని క్వశ్చన్ చేసేలా చేశాయి. దీంతో హీరోగానే కాకుండా క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ కూడా చేస్తే బాగుంటుందని నాగార్జున డిసైడ్ అయ్యారు. గతంలో కూడా నాగార్జున.. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘నిన్నే ప్రేమిస్తా’, మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘అధిపతి’, రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేశారు.
ఆ అనుభవంతో ‘కుబేరా’ సినిమాలో దీపక్ అనే స్పెషల్ రోల్ చేశారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘కూలీ’ సినిమాలో విలన్ గా కూడా మెప్పించే ప్రయత్నం చేశారు నాగార్జున.
ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించిందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. నాగార్జునని స్టైలిష్ గా చూపించడంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యారు. కానీ నాగార్జున పోషించిన సైమన్ పాత్రలో సరైన డెప్త్ లేదు. రైటింగ్ వీక్ గా అనిపించింది. వాస్తవానికి సినిమాలో నాగార్జున పాత్రపై కూడా ఆడియన్స్ లో సింపతీ కలుగుతుంది. హీరో రోల్ చేసిన రజనీకాంత్, విలన్ నాగార్జున..లను వేరే పాత్ర మోసం చేస్తుంది. సో నాగార్జున పాత్ర మారిపోయినట్టు పాజిటివ్ ఎండింగ్ ఇచ్చే స్కోప్ కూడా కథలో ఉంది. కానీ లోకేష్ ఆ టర్న్ తీసుకోలేదు. మలయాళం యాక్టర్ శౌబిన్ షాహిర్ కథలో మెయిన్ విలన్. అతని పాత్రకి ఇచ్చిన ఎండింగ్ కూడా కామెడీగా ఉంది. ఈ రకంగా చూస్తే నాగార్జున చెప్పిన మార్పులు లోకేష్ కరెక్ట్ గా చేసుండకపోవచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక విషయం కన్ఫర్మ్… నాగార్జున స్టైలిష్ విలన్ గా బాగా సెట్ అవుతాడు. అది మాత్రం ‘కూలీ’ తో ప్రూవ్ అయ్యింది.