సాధారణంగా ఈటీవీ విన్ నుండి ఒక కంటెంట్ వస్తుంది అంటే.. కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంది ఆ సంస్థ. అయితే.. మంచి హైప్ తో రిలీజ్ అయిన “కానిస్టేబుల్ కనకం” సీజన్ 1 మాత్రం పెద్దగా అలరించలేకపోయింది. ముఖ్యంగా 6 ఎపిసోడ్ల సీజన్ 1 ల్యాగ్ కారణంగా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయలేకపోయింది. ఆ తప్పులను సరిదిద్దుకొని సీజన్ 2తో ప్రేక్షకుల్ని మరోసారి పలకరించనున్నారు. మరి ఈ సీజన్ 2 ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? తెరలేపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలిగిందా? అనేది చూద్దాం..!!
కథ: కనిపించకుండాపోయిన చంద్రిక (మేఘలేఖ)ను వెతికి పట్టుకోవడమే ధ్యేయంగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి (వర్ష బొల్లమ్మ)కి చంద్రిక అదృశ్యం విషయంలో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ విషయాల ఆధారంగా చంద్రికను కనకం కనిపెట్టగలిగిందా? ఇంతకీ చంద్రిక అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు? వాళ్లని కనకం ఎలా ఎదుర్కొంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “కానిస్టేబుల్ కనకం: సీజన్ 2” కథాంశం.
నటీనటుల పనితీరు: వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ ఆర్క్ లో మెచ్యురిటీని ఆమె తెరపై పండించిన తీరు ప్రశంసార్హం. నటిగా ఆమెకు ఈ సిరీస్ ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు.
సిరీస్ కి మరో ఇంపాక్ట్ ప్లేయర్ మేఘలేఖ. మొదటి సీజన్ లో చాలా లిమిటెడ్ సీన్స్ లో లుక్స్ తో మాత్రమే మెప్పించిన మేఘలేఖ, సెకండ్ సీజన్ లో మాత్రం కీలకపాత్రతో మెప్పించింది. ముఖ్యంగా ఆమె చుట్టూ అల్లుకున్న సందర్బాలు, సన్నివేశాలు అలరిస్తాయి.
సుచిత్ర ఆనందన్ క్యాస్టింగ్ & పెర్ఫార్మెన్స్ ఈ సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె గురించి ఎక్కువగా చెప్పలేం. సిరీస్ చూశాక సర్ప్రైజ్ అవ్వడమే కరెక్ట్.
రాజీవ్ కనకాల, రమణ భార్గవ్, జ్వాల కోటిల పాత్రలు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ.. ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
సాంకేతికవర్గం పనితీరు: సురేష్ బొబ్బిలి మరోసారి తన సత్తా చాటుకున్నాడు. నేపథ్య సంగీతంతో టెన్షన్ క్రియేట్ చేసిన విధానం ఎంత బాగుందో.. చివర్లో ఎమోషన్ ను ఎలివేట్ చేసిన తీరు కూడా అంతే బాగుంది.
సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉండగా.. ఎడిటింగ్ సెకండ్ సీజన్ కి మెయిన్ ఎసెట్ గా నిలిచింది. మొదటి సీజన్ కి వచ్చిన రివ్యూలు, ఫీడ్ బ్యాక్ ను కాస్త సీరియస్ గా తీసుకొని.. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు కానీ, రిపీటెడ్ షాట్స్ కానీ లేకుండా చాలా క్రిస్ప్ గా కట్ చేసారు. అందువల్ల.. 4 ఎపిసోడ్స్ సిరీస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అస్సలు బోర్ కొట్టదు.
దర్శకుడు ప్రశాంత్ ను సీజన్ 1 విషయంలో అనవసరంగా తిట్టుకున్నానే అని భావన కలిగింది సెకండ్ సీజన్ చూసాక. ఇంచుమించుగా 20 పాత్రలు కనిపించే సిరీస్ లో ప్రతి పాత్రకి ఒక క్లోజర్ ఇవ్వడం, అది కూడా కథనానికి తగ్గట్లుగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఒక రచయితగా సెకండ్ సీజన్ లోని ప్రతి ఎపిసోడ్ తో తన సత్తా చాటుకున్నాడు ప్రశాంత్. ముఖ్యంగా.. సిరీస్ కోర్ థీమ్ ను అతను అంతర్లీనంగా డిజైన్ చేసిన విధానం, దాన్ని చివర్లో ఎలివేట్ చేసిన తీరు అతడి అభిరుచికి అద్దం పట్టింది. అలాగే.. దర్శకుడిగా షాట్ మేకింగ్ & ఆర్టిస్టుల నుండి మంచి నటన రాబట్టుకొనే విషయాల్లో అతడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.
విశ్లేషణ: కంటెంట్ ఎవైలబిలిటీకి లిమిట్ లేకుండాపోయిన ఈ కాలంలో.. ఒక సినిమా లేదా సిరీస్ తో ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం అనేది కత్తి మీద సాములా తయారయ్యింది. అందుకే మొదటి సీజన్ లో తడబడిన కనకం & టీమ్ సెకండ్ సీజన్ తో మాత్రం ఒక మంచి థ్రిల్లర్ చూశామనే సంతృప్తిని కలిగించగలిగారు. అలాగే.. సీజన్ 3 కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. కాస్త లేటైనా.. ఇంతే గ్రిప్పింగ్ గా సీజన్ 3 కూడా దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కించగలిగితే.. తెలుగు ఓటీటీ ప్రపంచంలో కానిస్టేబుల్ కనకం బెస్ట్ థ్రిల్లర్ గా నిలవడం ఖాయం.
ఫోకస్ పాయింట్: ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేసిన కనకం!
రేటింగ్: 3/5