Custody Review In Telugu: కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 12, 2023 / 12:09 PM IST

Cast & Crew

  • అక్కినేని నాగ చైతన్య (Hero)
  • కృతి శెట్టి (Heroine)
  • అరవింద్ స్వామి , శరత్‌కుమార్ , ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ , ప్రేమి విశ్వనాధ్ (Cast)
  • వెంకట్ ప్రభు (Director)
  • శ్రీనివాస చిట్టూరి (Producer)
  • ఇళయరాజా, యువన్ శంకర్ రాజా (Music)
  • ఎస్.ఆర్. కథిర్ (Cinematography)
  • Release Date : మే 12, 2023

“థ్యాంక్యూ” సినిమా తరువాత రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో వర్కవుటవ్వదని గ్రహించి.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించాడు. తనదైన మార్క్ స్క్రీన్ ప్లే తో సంచలనం సృష్టించగలిగే వెంకట్ ప్రభు.. తెలుగు-తమిళ భాషల్లో బైలింగువల్ గా తెరకెక్కించిన సినిమా “కస్టడీ”. చైతన్య సరసన మరోసారి కృతిశెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతోనైనా చైతూ హిట్ అందుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: ఒక నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్ గా ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) ప్రశంసలు అందుకొని జిల్లాలో బాగా పాపులర్ అవుతాడు శివ (నాగచైతన్య). ఒకరోజు నైట్ షిఫ్ట్ డ్యూటీలో భాగంగా.. తనకు తెలియకుండానే బడా క్రిమినల్ రాజూ (అరవిందస్వామి) & సి.బి.ఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)లను అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు.

ఆ ఒక్క సంఘటనతో శివ జీవితం తలకిందులవుతుంది. అసలు రాజూ ఎవరు? అతడ్ని సి.బి.ఐ ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది?, ఈ క్రిమినల్ పోలీస్ గేమ్ లో శివ ఎందుకు ఇరుక్కున్నాడు? చివరికి ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “కస్టడీ” సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: నాగచైతన్య చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. పోలీస్ కానిస్టేబుల్ గా, ప్రియుడిగా, కొడుకుగా, తమ్ముడిగా భిన్నమైన ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. ముఖ్యంగా.. యాక్షన్ బ్లాక్స్ లో మంచి పరిణితి కనబరిచాడు. “కస్టడీ” చైతన్య కెరీర్ లో ఒక మంచి సినిమాగా మిగలడమే కాదు.. అతడ్ని హీరోగా మరో మెట్టు ఎక్కించింది. కృతిశెట్టి తన వయసుకి మించి కాస్ట్యూమ్స్ కారణంగా క్యూట్ గా ఎక్కడా అనిపించలేదు. నటిగా మాత్రం పర్వాలేదనిపించుకుంది.

అరవింద స్వామికి విలన్ రోల్స్ కొత్త కాకపోయినా.. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ & డైలాగ్స్ అలరిస్తాయి. అలాగే.. శరత్ కుమార్ ఆశ్చర్యపరుస్తాడు. వెన్నెల కిషోర్, ప్రియమణి, సంపత్ రాజ్, రాంకీ, రవిప్రకాశ్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: వెంకట్ ప్రభు నుంచి ఏ తరహా సినిమా ఆశిస్తామో.. సరిగ్గా అలాంటి సినిమానే “కస్టడీ”. సీరియస్ సినిమాలోనూ కామెడీ పండించడం అనేది వెంకట్ మార్క్, అందుకే సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ తోపాటు కామెడీ కూడా సరైన పాళ్లలో ఉండేలా చూసుకున్నాడు. అయితే.. వెంకట్ ప్రభు మార్క్ ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే మాత్రం సినిమాలో మిస్ అయ్యింది.

ఇళయరాజా & యువన్ శంకర్ రాజా ద్వయం అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ.. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం మాత్రం అలరించింది. సినిమాటోగ్రాఫర్ ఎస్.ఆర్.కధిర్ సినిమాకి మరో హీరో. యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా కంపోజ్ చేశాడు. అందువల్ల.. ఎక్కడా కూడా ఇది అతి అనిపించదు. అలాగే.. నైట్ సీన్స్ పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది. తెలుగు-తమిళ బైలింగువల్ అవ్వడం వల్ల కాస్త తమిళ నటులు ఎక్కువగా కనిపించి.. అక్కడక్కడా డబ్బింగ్ ఫీల్స్ తీసుకొచ్చారు.

విశ్లేషణ: సెకండాఫ్ లో వచ్చే చిన్నపాటి ల్యాగ్ ను భరించగలిగితే.. (Custody) “కస్టడీ” బాగా ఆకట్టుకుంటుంది. చైతన్య నటన, వెంకట్ ప్రభు మార్క్ టేకింగ్, యువన్ బీజీయమ్ కోసం ఈ చిత్రాన్ని హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. మొత్తానికి నాగచైతన్యకి సోలో హిట్ దొరికిందనే చెప్పాలి.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus