సినిమాలో ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎంత బడ్జెట్ పెట్టారు, ఎలాంటి లొకేషన్ లో తీశారు అనే విషయాలు జనాలు పట్టించుకోవడం మానేశారు. సినిమా బాగుంటే చాలు ఆర్టిస్ట్ ఎవరు, ఏ భాషా చిత్రం అనేది ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈమధ్య కాన్సెప్ట్ చిత్రాల తాకిడి పెరిగింది. తెలుగు, తమిళ భాషల్లోనే మాత్రమే కాదు హాలీవుడ్ లోనూ దర్శకనిర్మాతలు ఇప్పుడు కాన్సెప్ట్ సినిమాలవైపే మొగ్గుచూపుతున్నారు. వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఎవెంజర్స్” లాంటి సినిమాలకు ఏస్థాయి క్రేజ్ ఉంటుందో.. 50 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన కాన్సెప్ట్ మూవీస్ కి కూడా అదే స్థాయి క్రేజ్ ఉంటుంది. అందుకు నిదర్శనం ఇటీవల విడుదలైన “డోంట్ బ్రీత్”, “లైట్స్ ఔట్” చిత్రాలే. చాలా తక్కువ బడ్జెట్ మరియు అయిదారుగురు పాత్రధారులతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చకి హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది.
ఇప్పుడు ఆ రెండు చిత్రాల కోవలో తెరకెక్కిన తాజా చిత్రం “ఎ క్వైట్ ప్లేస్” కూడా ఆ రెండు సినిమాలను మించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. కొన్ని గ్రహాంతరవాసుల ఒక గ్రామాన్ని ఆక్రమిస్తాయి. వాటికి కళ్ళు కనిపించవు. కేవలం శబ్ధాన్ని బట్టి మనుషుల మీద దాడి చేస్తాయి. ఊరంతా వల్లకాడైపోతుంది. చివరికి ఒకే ఒక్క కుటుంబం మాత్రం మిగులుతుంది. సైలెంట్ గా ఉండడం మాత్రమే అక్కడ ప్రాణాలతో బ్రతకడానికి ఏకైక మార్గం. అక్కడ్నుంచి బయటపడే మార్గం దొరక్క, ఆ గ్రహాంతర రాకాసులను చంపే దారి తెలియక సంవత్సరాలపాటు భయపడి అక్కడే బ్రతుకుతుంటారు. చివరికి వాళ్ళు ఆ రాకాసుల బారి నుంచి ఎలా తప్పించుకోగలిగారు? అనేది “ఎ క్వైట్ ప్లేస్” కథాంశం. సినిమా మొత్తానికి మనకి కేవలం ఒక రెండు అరుపులు మాత్రమే వినపడతాయి. మిగతాదంతా మూకీ సినిమాని తలపిస్తుంది. కానీ.. గంటన్నర నిడివి ఉన్న ఈ సినిమా ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. అంత అద్భుతంగా నడిపించాడు దర్శకుడు చిత్రాన్ని. ఒక గర్భిణీస్త్రీ ప్రసవ వేదనను కూడా పంటిబిగువున భరిస్తూ తనకు పుట్టబోయే బిడ్డ ప్రాణాల కోసం పరితపించే సన్నివేశంలో ప్రతి ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్ కి జారిపోతాడు. ప్రస్తుతం ఈ సినిమా హాలీవుడ్ బాక్సాఫీస్ మాత్రమే కాదు ఇండియన్ బాక్సాఫీసును కూడా షేక్ చేస్తోంది. నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్నీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతుండడం విశేషం. సో, డియర్ మూవీ లవర్స్ మీరందరూ తప్పకుండా చూసి ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.