దాసరి నారాయణ రావు సినీ అడుగులు

బహుముఖ ప్రజ్ఞాశాలి .. ఈ మాటకు సరిగ్గా సూటయ్యే మహానుభావుడు దాసరి నారాయణరావు. దర్శకుడిగా అద్భుత చిత్రాలను తెరకెక్కిస్తూనే అప్పుడప్పుడు నటుడిగా వెండితెరపై మెరిశారు. మెప్పించారు. గేయ రచయితగా క్లాసిక్ పాటలను అందించారు. నిర్మాతగా తనదైన ముద్రవేశారు. తన 50ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎంతోమందిని నటులుగా, దర్శకులుగా తీర్చిదిద్ది గురువుగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోను తిరుగులేదని అనిపించుకున్నారు. అటువంటి దర్శకరత్న సినీ పయనం పై ఫోకస్..

రైతు బిడ్డపశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ వ్యవసాయ కుటుంబంలో దాసరి నారాయణరావు పుట్టారు. దాసరి తండ్రి పేరు సాయిరాజు. దాసరికి చిన్నప్పటి నుంచి నాటకాలంటే చాలా పిచ్చి. డిగ్రీలో ఉండగానే చిన్నచిన్న నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలా నాటకాలు వేసుకుంటూ సినీ రంగానికి వచ్చారు.

తొలి చిత్రం తాత-మనవడుఅప్పట్లో అగ్ర నిర్మాతగా ఉన్న రాఘవగారు నిర్మించిన “తాత-మనవడు” చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

అవార్డులురెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. “కంటే కూతుర్నే కను” చిత్రానికి 2000 సంవత్సరంలో జాతీయ పురస్కారం దక్కింది. అలాగే 1982లో మేఘ సందేశం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నారు. గోరింటాకు, ప్రేమాభిషేకం, ఒసేయ్ రాములమ్మ, మేఘ సందేశం చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుదాసరి 150కిపైగా చిత్రాలకు తెరకెక్కించారు. అలాగే నిర్మాతగా 53 చిత్రాలను నిర్మించిన దాసరి… 250కిపైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించడం విశేషం. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దాసరి చోటు దక్కించుకున్నారు.

నటుడిగాను నందులు వరించాయిసుమారు 63 సినిమాల్లో రకరకాల పాత్రల్లో దాసరి మెప్పించారు. మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఒసేయ్ రాములమ్మ, మేస్త్రీ, ఎర్రబస్సు లాంటి చిత్రాల్లో నటనతో దాసరి ఆకట్టుకున్నారు. మేస్త్రి, మామగారు చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

కళాప్రపూర్ణ పురస్కారంప్రజలను ప్రభావితం చేసే ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిన దాసరి… నాటక, సినీ రంగంలో విశేష కృషికి గాను 1986లో ఆంధ్రా విశ్వవిద్యాలయం అయన్ని కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. 2001లో జీవిత సాఫల్య పురస్కారాన్ని దాసరి అందుకున్నారు.

కొత్త నటులకు ప్రోత్సాహందాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ప్రతిభను ప్రోత్సహించేవారు. తన కెరీర్లో13 మంది హీరోయిన్స్ ని, 15 మందికిపైగా హీరోలను, ఎంతో మంది దర్శకులు, సంగీత దర్శకులు, నృత్యదర్శకులను తెలుగు చలన చిత్ర సీమకు పరిచయం చేశారు.

పాలకొల్లు నుంచి పార్లమెంట్ దాకా దాసరి పయనం సాగింది. ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని విజయాలను అందుకున్నారు. చివరకి రెండునెలలుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. మే 30 న తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫిల్మ్ ఫోకస్ కోరుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus