ప్రముఖ కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీ తమడ మీడియా మరియు బిబిసి సంయుక్తంగా రూపొందించిన వెబ్ సిరీస్ “డెడ్ పిక్సల్స్”. నీహారిక కొణిదెల, వైవా హర్ష, సాయి రోనక్, అక్షయ్ కీలకపాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. గేమింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నవతరం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: గాయత్రి (నీహారిక కొణిదెల), భార్గవ్ (అక్షయ్), రోషన్ (సాయి రోనక్) & వైవా హర్షలు ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఫ్రెండ్స్ అవుతారు. ఎవరైనా ఫ్రీ టైమ్ లో గేమ్స్ ఆడతారు. వీళ్ళు మాత్రం పనులన్నీ ఆపుకొని మరీ గేమ్స్ ఆడుతుంటారు. అలా గేమ్స్ ఆడుతూ..
పర్సనల్ లైఫ్ & గోల్స్ అనేది లేకుండా సాగిపోతుంటాయి వీళ్ళ జీవితాలు. ఈ గేమ్ అడిక్ట్స్ జీవితాలు ఎలా మారాయి? చివరికి ఏం తెలుసుకున్నారు? అనేది “డెడ్ పిక్సల్స్” వెబ్ సిరీస్ కథాంశం.
నటీనటుల పనితీరు: కన్ఫ్యూజ్డ్ యూత్ గా నీహారిక, అక్షయ్, సాయి రోనక్ లు ఆకట్టుకోగా.. పెళ్ళయి, పిల్లలున్నప్పటికీ వాళ్లెవ్వరినీ పట్టించుకోకుండా ఎప్పుడూ గేమ్స్ ఆడుకునే సగటు హై క్లాస్ వ్యక్తిగా వైవా హర్షలు తమ నటనతో అలరించారు. ముఖ్యంగా అమాయక యువకుడిగా సాయి రోనక్ ఆకట్టుకున్నాడు. అలాగే.. ఇండిపెండెంట్ & కరెంట్ జనరేషన్ గర్ల్ గా అలరించింది.
సాంకేతికవర్గం పనితీరు: ఫారిన్ వెబ్ సిరీస్ రీమేక్ అయినప్పటికీ.. ఆదిత్య మండల తెలుగు నేటివిటీకి తగ్గట్లు చేసిన మార్పులు-చేర్పులు ప్రశంసనీయం. అలాగే.. కరెంట్ జనరేషన్ గేమ్ అడిక్షన్ & వర్చువల్ ప్లెజర్ గురించి అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించి.. వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. మరీ ముఖ్యంగా యంగ్ జనరేషన్ యూత్ & గేమర్స్ బాగా కనెక్ట్ అయ్యేలా తీశాడు.
ఫహాద్ అబ్ధుల్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. చాలా లిమిటెడ్ స్పేస్ లో జరిగే కథను బోర్ కొట్టించకుండా తెరకెక్కించడం అనేది మామూలు విషయం కాదు. ఆ లెక్కన ఫహాద్ సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సిద్ధార్ధ్ సదాశివుని నేపధ్య సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ వంటివన్నీ బాగున్నాయి.
విశ్లేషణ: రెగ్యులర్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ డ్రామాలు చూసి చూసి బోర్ కొట్టిన ఆడియన్స్ కు ఒక సరికొత్త అనుభూతిని అందించే వెబ్ సిరీస్ (Dead Pixels) “డెడ్ పిక్సల్స్”. నీహారిక, వైవా హర్ష, సాయి రోనాక్, భార్గవ్ ల పెర్ఫార్మెన్స్ తోపాటు.. చివర్లో అనునయంగా ఇచ్చే మెసేజ్ కోసం ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్ ను హ్యాపీగా బింగ్ వాచ్ చేయొచ్చు.
రేటింగ్: 3/5