దేవ‌దాస్

నాగార్జున-నాని హీరోలుగా తెరకెక్కిన సరికొత్త మల్టీస్టారర్ చిత్రం “దేవదాసు”. “భలే మంచిరోజు, శమంతకమణి” చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఆ అంచనాలను సినిమా అంగుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ : దేవ (నాగార్జున) ఓ మాఫియా డాన్, చిన్నప్పటి క్రైమ్ కారిడార్ లో పెరగడం వలన మనిషి, మనసు, ప్రాణం విలువ తెలియదు. తనను పెంచి పెద్ద చేసిన బడా డాన్ (శరత్ కుమార్) ను కొందరు సిండికేట్ గా ఫామ్ అయ్యి చంపేయడంతో అప్పటివరకూ అండర్ గ్రౌండ్ లో ఉన్న దేవ హైద్రాబాద్ వస్తాడు.

దాసు (నాని) ఎం.బి.బి.ఎస్ తోపాటు ఎం.ఎస్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించిన డాక్టర్. మనిషి చాలా మంచోడు కానీ కాస్త కంగారు ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. అందువల్ల ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం కూడా కోల్పోతాడు. భిన్న ధృవాల్లాంటి వీళ్ళిద్దరూ ఒకానొక సందర్భంలో కలుసుకోవడమే కాక కలిసి జర్నీ చేయడం మొదలెడతారు. అలా మొదలైన “దేవదాసు”ల ప్రయాణం చివరికి ఎక్కడ చేరింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు : నాని తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఎంతగా ట్రై చేసినా నాగార్జున చరిష్మాను, స్క్రీన్ ప్రెజన్స్ ను మాత్రం బీట్ చేయలేకపోయాడు. అలాగని నాని తక్కువేమీ కాదు ఎమోషనల్ సీన్స్ లో ఎప్పటిలానే తనదైన శైలి మ్యానరిజమ్స్ తో ఆకట్టుకొన్నాడు. అలాగే.. సినిమాలో కామెడీ పండించే భారాన్ని తన భుజాలపై వేసుకొని సక్సెస్ అయ్యాడు కూడా. కానీ.. నాగార్జున గ్లామర్ & పెర్ఫార్మెన్స్ ముందు మాత్రం నాని తాళలేకపోయాడు. నాగార్జునను కొన్ని ఎలివేషన్ సీన్స్ లో చూస్తుంటే “ఏంటి ఈయనకి 59 ఏళ్ళా?” అని ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం ఖాయం.

శరత్ కుమార్ పాత్ర చిన్నదే అయినా స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించాడు. మురళీశర్మ, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ (“రంగ్ దే బసంతీ, గోల్డ్” చిత్రాల ఫేమ్) తమ పాత్రలకు న్యాయం చేశారు. కాంపౌండర్ గా సత్య, రౌడీగా “బాహుబలి” ప్రభాకర్ లు కాసేపు నవ్విస్తారు.

బేసిగ్గా.. హీరోయిన్స్ కి సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో లాస్ట్ లో చెప్పడం జరిగింది. జాహ్నవి పాత్రకు ఆకాంక్ష సరిగ్గా సరిపోగా.. పూజా అనే పోలీస్ పాత్రకు మాత్రం రష్మిక మిస్ ఫిట్. ఆ అమ్మాయికి వేసిన మేకప్ కానీ.. అమ్మాయి ఎక్స్ ప్రెషన్స్ కానీ చాలా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి. “ఛలో, గీత గోవిందం”తో రష్మిక సంపాదించుకొన్న క్రేజ్ ఈ సినిమాతో పోగొట్టుకొనే అవకాశాలున్నాయి. వీళ్ళందరికంటే ముఖ్యంగా.. చాలా చిన్న ఇంకా చెప్పాలంటే అతిధి పాత్రే అయినప్పటికీ బాలసుబ్రమణ్యం గారిని వెండితెరపై చూసుకోవడం మాత్రం చాలా సంతోషాన్ని కలిగించింది.

సాంకేతికవర్గం పనితీరు : “ఎవడో అన్నాడు మణిశర్మ పని అయిపోయిందని, ఆడ్ని నరికేయాలి” అన్నంత కోపం వస్తుంది ఈ సినిమా చూశాక. మణిశర్మ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా అద్భుతమైన బాణీలతోపాటు నేపధ్య సంగీతంతో అదరగొట్టాడు. సినిమాకి మేజర్ ఎస్సెట్స్ లో మణిశర్మ సంగీతం మొదటి వరుసలో నిలుస్తుంది. షామ్ దత్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. అశ్వినీదత్ రాజీలేని నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది కానీ.. ఎడిటర్ ఇంకాస్త కఠినంగా వ్యవహరించి ఉంటే సెకండాఫ్ లో ల్యాగ్ కూడా లేకుండా ఉండేది.

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య సినిమాను తెరకెక్కించే విధానమే అతడికి దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే.. తన సినిమాల్లో కనిపించే క్యారెక్టరైజేషన్ & సిచ్యుయేషనల్ కామెడీ ఈ సినిమాలో మిస్ అయ్యింది. ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేక పక్కదారి పట్టాడో లేక కథ తనది కాకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాడో తెలియదు కానీ.. చాలా చోట్ల తడబడ్డాడు. సెకండాఫ్ లో ఎమోషనల్ టచ్ ఇవ్వడం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. కాకపోతే.. సినిమా స్లో అవుతోంది అనిపించినప్పుడల్లా కామెడీతో కవర్ చేయడానికి ప్రయత్నించాడు కానీ అన్ని వేళలా అది కాపాడదు అని ఈ సినిమాతో అర్ధమయ్యుంటుంది.

ఇద్దరు స్టార్ హీరోలు అది కూడా ఎలాంటి సన్నివేశాన్నైనా, ఎమోషన్ ను అయినా అద్భుతంగా పండించగల సత్తా ఉన్న నటులు దొరికినప్పుడు కేవలం కామెడీ సినిమా తీసేసి సేఫ్ గేమ్ ఆడదామనుకోవడం ఒక దర్శకుడిగా కమర్షియల్ గా శ్రీరామ్ ఆదిత్యను సేఫ్ జోన్ లో పడేసి ఉండొచ్చు కానీ.. “నాని-నాగార్జున” ఉన్నారు అని భారీ అంచనాలతో ధియేటర్ కి వచ్చే ప్రేక్షకుల్ని మాత్రం నిరాశకు గురి చేస్తోంది.

విశ్లేషణ : “దేవదాసు” ఒక మంచి టైమ్ పాస్ మూవీ. నాగార్జున చరిష్మా, నాని కామెడీ, మణిశర్మ సంగీతం కోసం ఈ సినిమాని సరదాగా ఒకసారి చూడొచ్చు. మరోవారం వరకు ఈ సినిమాకి పోటీ లేదు కాబట్టి బాక్సాఫీస్ వద్ద కూడా చిన్నసైజు హల్ చల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ.. శ్రీరామ్ ఆదిత్య మాత్రం స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త శ్రద్ధతో దృష్టి సారించి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus