తమిళ కథానాయకుడు ధనుష్ నటించిన ‘వేలై ఇల్ల పట్టాదారి-వీఐపీ’ అతడి కెరీర్లోనే మంచి విజయాన్ని సాధించింది. ధనుష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ‘రఘువరన్ బీటెక్’ పేరుతో తెలుగులో విడుదలై ఇక్కడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. ధనుష్ కి తెలుగులో మార్కెట్ ఏర్పడింది అంటే.. అది ఈ సినిమా వల్లే. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రానుంది.ఈ సినిమా ఫలితాన్ని చూశాక సీక్వెల్ చేయాలని ధనుష్ బలంగా నిర్ణయించుకున్నాడట. అయితే చిత్ర దర్శకుడైన వేల్ రాజ్ మాత్రం ఇతర సినిమాలతో బిజీ అయిపోయాడు.
కానీ ధనుష్ పట్టువదలకుండా తానే కథ సిద్ధం చేశాడు. వీ క్రియేషన్స్ బ్యానర్ పై రజనీకాంత్ తో ‘కబాలి’ సినిమా చేసిన థాను ఈ సినిమాని నిర్మించనున్నారు. ధనుష్ సంభాషణలు సైతం సమకూరుస్తున్న ఈ సినిమాకి రజనీ చిన్న కుమార్తె, ధనుష్ మరదలు సౌందర్య దర్శకత్వం వహించనున్నారు. స్వతహాగా గ్రాఫిక్స్ నిపుణురాలైన సౌందర్య తండ్రి రజనీకాంత్ ప్రధాన పాత్రలో యానిమేషన్ సినిమా ‘కొచ్చడయాన్’ (తెలుగులో విక్రమసింహ) చేఇస్నా సంగతి తెలిసిందే. తొలి భాగం తెలుగులో సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ద్విభాషా చిత్రంగా రూపొందించనుండటం విశేషం. ధనుష్ సహ నిర్మాతగానూ వ్యవహరించనున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.