ఫిబ్రవరి నుంచి తేజ-వెంకటేష్ ల సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది, ఈ సినిమాలో నారా రోహిత్ హీరో వెంకటేష్ కి తమ్ముడిగా నటించబోతున్నాడు అనే వార్తలు, వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ కూడా ఫిలిమ్ నగర్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ప్రస్తుతం బాలయ్యతో కలిసి “ఎన్టీయార్” బయోపిక్ ను తెరకెక్కిస్తున్న తేజ ఆ సినిమా పూర్తయ్యేవరకూ వెంకీ సినిమాని పక్కనపెడదామనుకొన్నాడట. అయితే.. అన్నాళ్లపాటు ఆగడం ఇష్టం లేని వెంకటేష్ సినిమాని మొత్తానికి ఆపేశాడని వినికిడి.
గతంలో మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ప్రారంభమైన “రాధ” చిత్రాన్ని కూడా ఇదే విధంగా వెంకీ ఉన్నపళంగా ఆపేశాడు. అయితే.. తేజ సన్నిహిత వర్గాలు చెబుతున్నదేమిటంటే.. తేజ రెండు సినిమాలకి సమాంతర న్యాయం చేస్తాడని, వెంకీ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ఎన్టీయార్ బయోపిక్ ప్రొజెక్ట్ చాలా ప్రెస్టేజియస్ కావడం వల్లనే ఆ సినిమాపై ఎక్కువ కాన్సన్ ట్రేషన్ పెడుతున్నాడే తప్ప, సినిమా ఆగిపోయిందని వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. మరి ఈ రెండిట్లో నిజం ఏమిటో తెలియాలంటే తేజ స్వయంగానైనా స్పందించాలి లేక తేజ-వెంకీల సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయినా రావాలి.