హీరోయిన్ దిగంగన సూర్యవంశీ.. స్పెషల్ ఇంటర్వ్యూ..!

‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించిన ‘హిప్పీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది దిగంగన సూర్యవంశీ. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ ఈమె నటనకి, గ్లామర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈమె నటించిన రెండో చిత్రం ‘వలయం’. లక్ష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది. రమేష్ కడుముల ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పాల్గొని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది :

ఈ చిత్రంలో దిశా గురించి అలాగే సినిమా నేపధ్యం గురించి చెప్పండి..!

ఈ చిత్రంలో నా పాత్ర పేరు దిశా. సంప్రదాయమైన కుటుంబం నుండీ వచ్చిన ఓ అమ్మాయిలా దిశా కనిపిస్తుంది. ఇక హీరోతో వివాహం అయిన తరువాత అనుకోకుండా దిశా మిస్ అవుతుంది. ఆ తరువాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మీరు సినిమాలో చూడాలి.

ఈ చిత్రానికి ‘వలయం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ..!

తన భార్య కనిపించకుండాపోవడంతో హీరో ఎన్నో సమస్యల్లో చిక్కుకుంటాడు. ఓ పక్క బాధ, మరో పక్క తన భార్య కి ఏమైందో అనే కంగారు. ఇక అతని పై అలాగే అతని భార్య పై ఎన్నో నిందలు పడటం.. అతనికి ఏం చెయ్యాలి తెలీని పరిస్థితి..? అందుకే ఈ చిత్రానికి ‘వలయం’ అనే పేరు పెట్టారు.

‘హిప్పీ’ సినిమా ప్లాప్ అయ్యింది.. ‘ఫస్ట్ సినిమానే ప్లాప్ అయ్యిందే’ అని బాధ పడ్డారా?

కచ్చితంగా బాధ పడ్డాను. మొదటి సినిమానే ఇలా అయ్యింది ఏంటి అని.! కానీ ఆ చిత్రం సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా పాత్ర గురించి మాత్రమే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాను. కొన్నిసార్లు ఫలితం గురించి మనం అంచనా వెయ్యలేము. ‘హిప్పీ’ ప్లాప్ అయ్యింది.. అయితే అన్ని రివ్యూస్ లో అలాగే పబ్లిక్ టాక్ వంటి వాటిలో నా నటన గురించి పాజిటివ్ కామెంట్స్ చేశారు ప్రేక్షకులు. సో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు.. నేను హ్యాపీ.

‘హిప్పీ’ ఫలితం వల్ల ఫ్యూచర్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకున్నారా?

కచ్చితంగా .. కేవలం నా పాత్ర మీదే కాకుండా.. స్క్రిప్ట్ పై కూడా ఫోకస్ పెట్టాలి అని తెలుసుకున్నాను. ‘వలయం’ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇక నుండీ స్క్రిప్ట్ పై కూడా దృష్టి పెడతాను.

మీరు రైటర్ అని విన్నాం?

అవును.. నేను రైటర్ ని కూడా..! ఇప్పటికే రెండు కథలు రెడీ చేసుకున్నాను. తర్వాత వాటిని తెరకెక్కించే ప్రయత్నం చేస్తాను.

డైరెక్షన్ పై కూడా ఇంట్రెస్ట్ ఉందా?

అమ్మో.. అది చాలా పెద్ద బాధ్యత..! కొంచెం ఎదిగిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా. ఇప్పట్లో అయితే అలాంటి ఆలోచన లేదు.

తెలుగులో మీకు నచ్చిన హీరోలు ఎవరు. ఒక వేళ సినిమా చేయాల్సి వస్తే ఏ హీరోతో చెయ్యాలని ఆశపడుతున్నారు?

నాకు రాంచరణ్, మహేష్ బాబు అంటే ఇష్టం. వాళ్ళతో సినిమా చేసే అవకాశం వస్తే మిస్ చేసుకోను..!

 

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రస్తుతం గోపీచంద్ గారి ‘సీటిమార్’ సినిమాలో నటిస్తున్నాను. అందులో ఓ కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తాను. అలాగే ఓ హిందీ చిత్రం కూడా ఫైనల్ కావాల్సి ఉంది.

– Interview by Phani Kumar

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus