దిల్ బేచారా సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 24, 2020 / 10:42 PM IST

“ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్” అనే ఆంగ్ల నవల ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం స్పూర్తితో రూపొందిన బాలీవుడ్ చిత్రం “దిల్ బేచారా”. బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్ నటించిన ఆఖరి చిత్రమిదే. జూన్ 14న ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సుశాంత్ కు నివాళిగా హాట్ స్టార్ ఈ చిత్రాన్ని అందరూ ఉచితంగా చూసే ఆప్షన్ ఇచ్చింది. జూన్ 24 సాయంత్రం నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!

కథ: కిజి బసు (సంజనా సాంఘి) చిన్నప్పటి నుండి థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటుంది. ముక్కుకి ఆక్సిజన్ పైప్, భుజాన ఆక్సిజన్ సిలిండర్ లేనిదే గంటసేపు కూడా స్వేచ్ఛగా బ్రతకలేని అమ్మాయి. ఆమెకు కాలేజ్ లో పరిచయమవుతాడు ఇమ్మాన్యుల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మ్యానీ (సుశాంత్ సింగ్ రాజ్ పుట్). ఓ యాక్సిడెంట్ లో కాలు కోల్పోయి.. ప్రోస్థెటిక్ లెగ్ తోనే అందరినీ నవ్విస్తూ బ్రతికేస్తుంటాడు. ఈ ఇద్దరూ కాలేజ్ లో పరిచయస్తులుగా మారి, అనంతరం ప్రేమించుకొని.. వాళ్ళిద్దరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అభిమన్యు వీర్ (సైఫ్ అలీఖాన్)ను కలవడానికి ప్యారిస్ వెళ్తారు. అక్కడ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకొన్న కిజి-మ్యానీలకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేమిటి? వీరి ప్రేమ ప్రయాణం ఎక్కడిదాకా సాగింది? అనేది “దిల్ బేచారా” కథాంశం.

నటీనటుల పనితీరు: సుశాంత్ సింగ్ చనిపోకపోతే ఎలా ఉండేదో తెలియదు కానీ.. సినిమా చూస్తున్నంతసేపు అతనిప్పుడు ఈ లోకంలో లేడు అని గుర్తుకొచ్చినప్పుడల్లా కళ్ల వెంబడి సన్నటి జీరలా కన్నీరు ఉబికి వస్తుంది. ఇంత చలాకీ కుర్రాడా ఉరేసుకొని మరీ చనిపోయాడు? అని మనసులో ఒక తెలియని అగాధం ఏర్పడుతుంది. అతడి నవ్వు, సహజమైన నటన, స్పష్టమైన భావ వ్యక్తీకరణ బుల్లితెరపై చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇది సుశాంత్ మాత్రమే చేయాల్సిన సినిమా కాదు కానీ.. క్లైమాక్స్ మాత్రం సుశాంత్ కి అద్భుతమైన నివాళిలా ఉంటుంది.

సంజనా సాంఘి తన నటనతో సుశాంత్ ను డామినేట్ చేసింది. ఆమె పాత్ర చుట్టూనే సినిమా తిరిగినప్పటికీ.. సుశాంత్ నటనతో ఆడియన్స్ చూపును తనవైపుకు తిప్పుకున్నాడు. తల్లి పాత్రలో స్వస్తికా ముఖర్జీ, తండ్రిగా సశ్వతా చటర్జీలు ఆకట్టుకున్నారు. బెంగాలీ నటులు కావడంతో.. బెంగాళీ పేరెంట్స్ రోల్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. అతిధి పాత్రలో సైఫ్ అలీఖాన్ మెప్పించడానికి ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా మారిన పాపులర్ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా తనకు లభించిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకోలేదు. సుశాంత్-సంజనాలు పాత్రలకు ప్రాణం పోసినప్పటికీ.. అడాప్షన్ లో ఫెయిల్ అయ్యారు రచయిత మరియు దర్శక బృందం. క్యారెక్టర్స్ లో లీనమవ్వడంతో సుశాంత్ & సంజన చూపిన శ్రద్ధలో పావు వంతు ముఖేష్ చబ్రా సన్నివేశాల రూపకల్పనలో పెట్టి ఉంటే సినిమా ఇంకాస్త హృద్యంగా ఉండేది. గంటా నలభై నిమిషాల సినిమా కూడా మధ్యలో బోర్ కొట్టిందంటే అది దర్శకుడి వైఫల్యమే.

సుశాంత్ సింగ్ తరువాత సినిమాకి ప్రాణం పెట్టేసిన వ్యక్తి ఏ.ఆర్.రెహమాన్. ఆయన పాటలు, నేపధ్య సంగీతం వింటూ సినిమాని చూడకుండా కూడా ఆస్వాదించొచ్చు. ఆస్థాయిలో సినిమాకి సంగీతంతో ప్రాణం పోసేశాడు రెహమాన్. ముఖ్యంగా “టైటిల్ ట్రాక్, మై తుమారా”లు మదిలో మెదులుతూనే ఉంటాయి. సుశాంత్ కి రెహమాన్ ఇచ్చిన సంగీత నివాళిగా “దిల్ బేచారా” ఆల్బమ్ ఎప్పటికీ నిలిచిపోతుంది.

సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ వర్క్ ఇంకాస్త పోయిటిక్ గా ఉంటే బాగుండేది. సినిమాలో సుశాంత్ సింగ్ ముఖం తప్ప గుర్తిండిపోయే ఫ్రేమ్ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది.

అయితే.. సుశాంత్ స్క్రీన్ ప్రెజన్స్ ముందు ఇవేవీ కనిపించవనుకోండి. సుశాంత్ లేడు అనే సెంటిమెంట్ ఫీల్ తో సినిమా చూసినా.. ఒక సగటు ప్రేక్షకుడిగా చూసినా సుశాంత్ నటన మాత్రం తప్పకుండా అలరిస్తుంది. అయితే.. సుశాంత్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే మాత్రం తెలియని బాధ కళ్ళలో ప్రస్పుటిస్తుంది.

విశ్లేషణ: నటుడిగా సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కి చక్కని నివాళి “దిల్ బేచారా”. ఎలాగూ ఈ సినిమా విషయంలో సుశాంత్ ని తప్ప వేరేమీ జనాలు పట్టించుకోరు కాబట్టి తప్పకుండా అందర్నీ సంతృప్తిపరుస్తుంది. ఒకవేళ సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉండకుండా ఈ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే ఎలా ఉండేది అనే ఆలోచనకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే.

రేటింగ్: సుశాంత్ మీద గౌరవంతో ఈ చిత్రానికి రేటింగ్ ఇవ్వడం లేదు.

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus