ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం విడుదలైంది. మహేష్ 25 వ సినిమా కాబట్టి భారీ ఎత్తున విడుదల చేసారు ఈ చిత్ర నిర్మాతలు. విడుదలైన మొదటి షో నుండే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరు చెప్పే ఒకే ఒక్క మైనస్ పాయింట్… రన్ టైం ఎక్కువయిందని..! అవును ఈ చిత్రం చాలా రన్ టైం ఉంది. సహజంగా కథ డిమాండ్ చేసినప్పుడు రన్ టైం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అందులో సందేహం లేదు. ‘అర్జున్ రెడ్డి’ ‘రంగస్థలం’ ‘మహానటి’ వంటి చిత్రాలు 3 గంటలు పైనే ఉన్నాయి. ‘మహర్షి’ చిత్రం కూడా 2 గంటల 59 నిముషాలు ఉంది. ఈ చిత్రంలో చాలా మంచి కథ ఉంది. అయితే కొన్ని చోట్ల చాలా డ్రాగ్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్ కాలేజీ ఫ్లాష్ బ్యాక్ వరకూ బానే ఉంటుంది. కానీ ఓ ట్విస్ట్ ఉంటుంది. కొన్ని కారణాల వలన విదేశాల్లో ఉండే హీరో ఇండియా రావాల్సి వస్తుంది. అలా రావడానికి మధ్యలో ఓ పాట.. అలాగే ‘సి ఈ ఓ’ అయిన హీరో ఆఫీస్ కు వెళ్ళి తన అధికారాన్ని గుర్తుచేయడం ఇదంతా ఓ 20 నిమిషాలు ఉంటుంది. ఇంత బిల్డప్ సీన్ అవసరమా అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. డైరెక్ట్ గా హీరో ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తే సరిపోతుంది కదా అని కొందరు ఫిలిం విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో కూడా హీరోయిన్ దగ్గర ఓ డ్యూయెట్. అక్కడ హీరో హీరోయిన్ కు ఎటువంటి రొమాంటిక్ సీన్ ఉండదు. కానీ డ్యూయెట్ వచ్చేస్తుంది. ఇది రెండవది. ఇక హీరో ఫ్రెండ్ అయిన అల్లరి నరేష్ పై విలన్ మనుషులు దాడి చేయడం..! ఈ సీన్లో హీరో ఉండగానే అల్లరి నరేష్ ను మూడు సార్లు కత్తితో పొడుస్తుంటారు.
ఇక్కడ హీరో మహేష్ కు మూడు క్లోజప్ లు వేస్తాడు డైరెక్టర్. ఈ ఫైట్ కూడా సింపుల్ గా ముగిస్తే సరిపోయేది. ఈ చిత్రంలో చివరి 40 నిముషాలు చాలా ఆకట్టుకుంటుంది. మెయిన్ కంటెంట్ కూడా అదే. కానీ ఆ సోల్ పాయింట్ వచ్చేసరికి చాలా మంది ప్రేక్షకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీని వలన ఆ సోల్ పాయింట్ కు బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఏదేమైనా పైన డిస్కస్ చేసైన సీన్లు తీసేస్తే ఒక 30 నిమిషాలైనా తగ్గుతుంది. దీంతో మంచి కథ, ఎమోషన్స్ ఉన్న ‘మహర్షి’ చిత్రం కమర్షియల్ హిట్ గా కూడా నిలిచే అవకాశం ఉంది. ఈ విషయం పై నిర్మాత దిల్ రాజు కాస్త దృష్టి పెడితే బాగుంటుంది.