సగానికి పైగా లాస్ అవ్వనున్న దిల్ రాజు

సినిమాల నిర్మాణంలోనే కాక డిస్ట్రిబ్యూటర్ గానూ ఫామ్ లో ఉన్న ఏకైక వ్యక్తి దిల్ రాజు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా.. ఆయన నిర్మించిన లేదా డిస్ట్రిబ్యూషనల్ రైట్స్ తీసుకొన్న ప్రతి సినిమా హిట్ అవుతూనే వచ్చింది. గత ఏడాది ఆయన నిర్మాణంలో రూపొందిన ఆరు చిత్రాలతోపాటు ఆయన హోల్ సేల్ రైట్స్ కొన్న సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి. అలాగే.. ఈ ఏడాది కూడా దిల్ రాజు హ్యాండ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక దిల్ రాజు-నాని కాంబినేషన్ అంటేనే హిట్ కి అర్ధం లాంటిదని భావిస్తున్న తరుణంలో వరుసగా ఎనిమిది విజయాల అనంతరం నాని కథానాయకుడిగా నటించిన “కృష్ణార్జున యుద్ధం” తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను కూడా దిల్ రాజు దక్కించుకోవడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ సాధించడం ఖాయం అనుకొన్నారందరూ. ముఖ్యంగా దర్శకుడు మేర్లపాక గాంధీ మునుపటి రెండు చిత్రాలు “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా” సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఉండడంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనుకొన్నారు.

కట్ చేస్తే.. అర్ధం కానీ స్క్రీన్ ప్లే, పస లేని కథతో తెరకెక్కిన “కృష్ణార్జున యుద్ధం” చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పాపం నానీ ద్విపాత్రాభినయం కూడా చిత్రాన్ని కాపాడలేకపోయింది. అసలే “రంగస్థలం” మాంచి ఊపు మీద ఉండడం, ఈవారం నుంచి “భరత్ అనే నేను” బాక్సాఫీస్ మీద దాడి మొదలెట్టడంతో.. ప్రస్తుతం “కృష్ణార్జున యుద్ధం” చిత్రాన్ని పట్టించుకొనే నాధుడు లేకుండాపోయాడు. ఈ కారణంగా దిల్ రాజుకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయట. పెట్టుబడిలో కనీసం సగం కూడా వెనక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదట. మరి ఈ సినిమా ద్వారా వాటిల్లిన నష్టాలను నెక్స్ట్ సినిమాతో ఏమైనా తీర్చే అవకాశాలేమైనా ఉన్నాయేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus