గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ (Game Changer) మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు 2025 సంక్రాంతికి విడుదల కానుంది. శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు పాన్ ఇండియా మూవీని దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కారణంగా బడ్జెట్ కూడా పెరిగినట్లు సమాచారం. ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి నార్త్ ఇండియాలో ప్రత్యేక స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.
ఇప్పటికే రా మచ్చా సాంగ్ ను విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా లక్నోలో భారీ ఈవెంట్ ద్వారా టీజర్ లాంచ్ చేసింది. పాన్ ఇండియా సినిమాలకు ఇలాంటి ఈవెంట్స్ సాధారణంగా హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారు. అయితే ఈ సారి దిల్ రాజు, రామ్ చరణ్, కియారా అద్వానీ(Kiara Advani), ఎస్.జె. సూర్య (SJ Suryah) లాంటి ప్రముఖులు లక్నోలో ఈవెంట్ నిర్వహించడం ఆశ్చర్యకరమని చెప్పాలి. టీజర్ కి మంచి స్పందన లభించింది, ఇక సినిమా పై అంచనాలు మరింత పెరిగేలా ఈ ఈవెంట్ అవుతుందనే ఆశాభావంతో ఉన్నారు.
లక్నోలో ఈవెంట్ నిర్వహించడం వల్ల ఉత్తర భారత ప్రేక్షకులను టార్గెట్ చేయగలిగారని విశ్లేషకులు అంటున్నారు. నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలపై ఆసక్తి పెరగడానికి ఇది ఒక మంచి అవకాశం. అదనంగా, లక్నోలో తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఉండటంతో, ఈవెంట్ కి వారు కూడా పెద్ద ఎత్తున హాజరై మంచి స్పందన కనబరిచారు. మొదటిసారిగా లక్నోలో పాన్ ఇండియా మూవీ ఈవెంట్ జరగడం అక్కడి ప్రేక్షకులను ఉత్సాహపరిచింది.
దిల్ రాజు ఈ ప్రమోషనల్ స్ట్రాటజీతో నార్త్ ప్రేక్షకుల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నార్త్ మార్కెట్ లో ‘గేమ్ చేంజర్’ క్రేజ్ పెరగడం వల్ల, ఈ సినిమా అక్కడ కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సక్సెస్ చూసిన దిల్ రాజు తదుపరి ప్రమోషనల్ ఈవెంట్స్ ను కూడా నార్త్ ఇండియాలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త స్ట్రాటజీ మీడియా సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది. ఇక సినిమా ఫలితం బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.