రాజకీయ లబ్ధి కోరుకునే వారు జ్యురీ సభ్యులా? : గుణశేఖర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  నంది అవార్డుల ప్రకటనపై ముందుగా ప్రశ్నించిన డైరక్టర్ గుణశేఖర్.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాసిన అతను ఈ వివాదంలో సెంటర్ అయ్యారు. అందుకే గుణశేఖర్ పై జ్యురీ కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. వాటన్నింటికీ ఈరోజు ప్రెస్ మీట్ లో ఆయన సమాధానం ఇచ్చారు. ఈ అవార్డుల వెనక రాజకీయం ఉందని ఆరోపించారు. మహిళా సాధికారతపై తాను తీసిన “రుద్రమదేవి” చిత్రానికి అవార్డు దక్కకపోవడం బాధాకరమన్నారు.

వర్మ కామెంట్స్, రీ కామెంట్స్ పై మాట్లాడుతూ .. “‘దాసరి నారాయణరావు తర్వాత రామ్‌గోపాల్‌వర్మ ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తిని తిట్టడం చాలా బాధ కలిగించింది. అది సరికాదు. అందుకే మీడియా ముఖంగా మద్దినేని రమేష్‌బాబుకు విన్నవించుకుంటున్నా. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. వర్మ మాటలను రమేష్‌ ఎందుకు సీరియస్‌గా తీసుకున్నారో అర్థం కావటం లేదు. అవి వ్యంగ్య బాణాలు వంటివి. ఆయన ఏ విషయంపైనైనా చురకలు అంటిస్తుంటారు. అవి చూసి మనం నవ్వి వూరుకోవాలి. లేదా రియలైజ్‌ కావాలి. పెద్ద పెద్ద వాళ్లే వాటిని సరదాగా తీసుకున్నారు. అది అలా వదిలేస్తే మంచిది.’’ అని హితవు పలికారు. అలాగే తన వెనుకాల ఎలాంటి శక్తులు లేవని స్పష్టం చేశారు.

నంది అవార్డు కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన జీవిత రాజశేఖర్ పై చురకలు అంటించారు. “జీవిత రాజశేఖర్ పై నాకు గౌరవముంది. ఆమె అవార్డుల ప్రకటన అవ్వగానే బయటికి వచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని జై కొట్టారు. ఆహ్వానిస్తే పార్టీలో చేరడానికి సిద్ధమన్నారు. ఇలా ఆమె విశ్వసనీయతను పోగొట్టుకున్నారు. అందుకే ఆమె మాటలను పట్టించుకోను. ప్రభుత్వాన్ని కోరేదొకటే. రాజకీయ లబ్ది పొందేవారు జ్యురీ లో ఉండడకూడదు” అని అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus