‘శబరి’ నుండీ ‘అలిసిన ఊపిరి…’ సాంగ్ రిలీజ్ చేసిన దర్శకుడు కరుణ కుమార్

  • April 30, 2024 / 07:36 PM IST

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది.

తాజాగా సినిమాలోని ‘అలిసిన ఊపిరి…’ పాటను ప్రముఖ దర్శకుడు, ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘మట్కా’ తెరకెక్కిస్తున్న కరుణ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతంలో రెహమాన్ రాసిన ‘అలిసిన ఊపిరి…’ పాటను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

”అలిసిన ఊపిరి
కణకణ మండే ఆయుధమల్లే మారే…
తరిమిన చీకటి
మృగమున చీల్చగా సరసరమంటూ సాగే…
భయమే వదిలి
ఇక ఈ క్షణమే ఎదురే తిరిగే ఒంటరి సైనం…
తనకు తానై బలం గెలవదా ఈ రణం…
కసిగా అవుతుంది సంసిద్ధమే” అంటూ సాగిందీ గీతం!

‘శబరి’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన గీతాలు తల్లి కూతుళ్ల మధ్య అనుబంధం, ప్రేమను చూపిస్తే… ‘అలిసిన ఊపిరి’ పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న మెయిన్ లీడ్ వరలక్ష్మిని చూపించారు. మధ్యలో కుమార్తె కోసం అన్వేషణలో పడిన తల్లి మనసును సైతం స్పృశించారు. గోపీసుందర్ బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, రెహమాన్ సాహిత్యం దీనినొక మోటివేషనల్ సాంగ్ తరహాలో మార్చాయి.

పాట విడుదల చేసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ… ”అందరికీ నమస్తే. ఇప్పుడే మహేంద్రనాథ్ గారు నిర్మించిన ‘శబరి’ సినిమాలోని ‘అలిసిన ఊపిరి’ సాంగ్ విడుదల చేశా. రెహమాన్ గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. పాట చాలా బావుంది. విజువలైజేషన్ కూడా బాగా చేశారు. మదర్ అండ్ డాటర్ ఎమోషన్ తీసుకుని థ్రిల్లర్ సినిమా చేశామని చెప్పారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు మహేంద్రనాథ్ గారితో మంచి అనుబంధం ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి వర్సటైల్ యాక్టర్ ఈ సినిమా చేశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ కథలు తక్కువగా వస్తున్న ఈ రోజుల్లో మంచి కథతో సినిమా తీశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.

నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ… ”సాంగ్ రిలీజ్ చేసిన కరుణ కుమార్ గారికి థాంక్స్. ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మా ‘శబరి’ సినిమాను మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్, ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. తల్లి కూతుళ్ల నేపథ్యంలో స్ట్రాంగ్ ఎమోషన్స్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది” అని చెప్పారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus