“ఎన్టీఆర్ కథానాయకుడు” రిలీజ్ కి ముందు వరకూ క్రిష్ అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. సాధారణమైన కథలను కూడా అసాధారణ చిత్రాలుగా మలచగల సత్తా ఉన్న దర్శకుడు క్రిష్ అని జనాలకి గట్టి నమ్మకం ఉండేది. అందుకు కారణం “గమ్యం, వేదం, కంచే” చిత్రాలే. ఆ సినిమాలు సాధించిన విజయం కంటే ఆ సినిమాల ద్వారా క్రిష్ సమాజానికి ఇచ్చిన మెసేజ్ జనాలని ఎక్కువగా ఆకట్టుకుంది. కానీ.. “ఎన్టీఆర్ కథానాయకుడు, మణికర్ణిక, ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమాల విడుదల తర్వాత దర్శకుడిగా ఆయన స్థాయి కొంతమేరకు తగ్గింది. నిన్నమొన్నటివరకూ ఆయన్ని గొప్ప దర్శకుడు అని పొగిడినవాళ్లే.. ఇప్పుడు ఆయన్ను చూసి మొహం చాటేస్తున్నారు.
ఈ విషయమై క్రిష్ ఇటీవల స్పందించాడు. తాను ఒక దర్శకుడిగా ఫెయిల్ అయినందుకు బాధపడడం లేదు కానీ.. నా ఫెయిల్యూర్ ను కొందరు సెలబ్రేట్ చేసుకోవడం నన్ను చాలా బాధిస్తోంది. అసలు సినిమా మొదలవ్వడానికి ముందు నుంచీ మేం ఓడిపోవాలని, మా సినిమా సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నవాళ్లే ఎక్కువ. ఇక సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్యకారణం సినిమా జనాలకి నచ్చక కాదు. సినిమాను థియేటర్లో చూసేందుకు జానాలు పెద్దగా ఆసక్తి చూపించకపోవడమే. అమేజాన్ ప్రైమ్ లో “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రాన్ని చూసినవాళ్ళందరూ “చాలా బాగుందండీ, చాలా బాగా తీశారు” అని మెసేజ్ చేస్తుంటే నవ్వాలో, బాధపడాలో అర్ధం కాని పరిస్థితి. అదే జనాలు థియేటర్ లో సినిమా చూసి ఉంటే ఇంకాస్త బాగుండేది కదా అనిపించింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.