హాలీవుడ్ సినిమా “అవతార్” ఇండియాలో క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ కేవలం హైదరాబాద్ లోనే సంవత్సరం ఆడగా.. సెకండ్ పార్ట్ ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటి ఫ్రాంచైజ్ లో వస్తున్న మూడో భాగం “అవతార్: ఫైర్ & యాష్” మీద మాత్రం ఎందుకో సరైన స్థాయి అంచనాలు లేవు. హాలీవుడ్ మీడియా ఎర్లీ ప్రీమియర్స్ కి ఇచ్చిన రివ్యూలు కూడా అందుకు కారణం అయ్యాయి. మరి జేమ్స్ క్యామెరాన్ మరోసారి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేయగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!
![]()
కథ: పండోరా గ్రహాన్ని మనుషులు కబ్జా చేయకుండా కాపాడుతూ వస్తున్న జేక్ సల్లీకి ఈసారి పండోరా జాతికి చెందిన యాష్ మనుషులతోనే పెద్ద సమస్య తలెత్తుతుంది. మనుషులతోపాటు పండోరా జాతివాళ్లు కూడా కలవడంతో జేక్ కి ఏం చేయాలో, పండోరా గ్రహాన్ని ఎలా కాపాడాలో అర్థం కానీ స్థితికి చేరుకుంటాడు. ఆ క్రమంలో జేక్ పోరాటానికి అండగా నిలిచింది ఎవరు? ఈ మహాయుద్ధంలో ఎలా గెలిచాడు? అనేది “అవతార్: ఫైర్ & యాష్” కథాంశం.
![]()
నటీనటుల పనితీరు: మనకి తెరపై కనిపించేది కేవలం అవతార్ లు మాత్రమే కాబట్టి, ఎవరు ఎలా నటించారు అనేది వివరించడం సబబు కాదు.
![]()
సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా వేలెత్తిచూపించే అంశం ఏమీ లేదు. కాలర్ గ్రేడింగ్, గ్రాఫిక్స్, ఎస్.ఎఫ్.ఎక్స్ వంటివన్నీ ఎప్పట్లానే అద్భుతంగా ఉన్నాయి.
అయితే.. సినిమాకి మెయిన్ మైనస్ క్రియేటివిటీ లోపించడమే. అసలు పండోరా ప్రపంచమే ఒక వింత, ఆ ప్రపంచంలో ఉండే అద్భుతాంశాలను చూస్తూనే ప్రేక్షకులు అమితాశ్చర్యపడుతుంటారు. అలాంటిది ఆ అద్భుతం అనే భావన మిస్ అయ్యింది. సినిమా మొత్తానికి విజువల్ గా కొత్తగా కనిపించేదేమీ లేకపోవడం అనేది పెద్ద మైనస్. ఇక కథ కూడా ఆల్రెడీ చూసిందే కదా? అనిపిస్తుంది. ఒక్క యాష్ అనే పండోరా జాతివాళ్లు మనుషులతో కలిసి జేక్ & గ్యాంగ్ మీద యుద్ధానికి పూనుకోవడం మినహా ఏదీ పెద్దగా ఎగ్జైట్ చేయదు. సో, దర్శకుడిగా జేమ్స్ అలరించలేకపోయాడు అని చెప్పడానికి కాస్త ఇబ్బందిగా, బాధగా ఉన్నప్పటికీ అదే నిజం.
![]()
విశ్లేషణ: అవతార్ లాంటి సినిమాల నుండి ప్రేక్షకులు కోరుకునేది వావ్ ఫ్యాక్టర్. నిజానికి సెకండ్ పార్ట్ లోనే అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. కానీ.. వాటర్ వరల్డ్ అనేది కాస్త ఎంజాయ్ చేసారు ఆడియన్స్. అయితే ఈ మూడో భాగంలో ఆ వావ్ ఫ్యాక్టర్ కంప్లీట్ గా మిస్ అయ్యింది. మెలోడ్రామా మరీ ఎక్కువైంది. అందువల్ల.. సినిమాని విజువల్ గా ఎంజాయ్ చేయలేక, కథ పరంగా ఎంగేజ్ అవ్వలేక ప్రేక్షకులు 197 నిమిషాలపాటు థియేటర్లో చాలా ఇబ్బందిపడతారు. మరి జేమ్స్ రాబోయే అవతార్ 4వ భాగంతో ఈ తప్పులన్నీ సరిదిద్దుకుని ప్రేక్షకుల్ని మళ్లీ రంజింపజేయాలని కోరుకుందాం.
![]()
ఫోకస్ పాయింట్: మంటలో బూడిద ఎక్కువైంది!
రేటింగ్: 2.5/5
