ఎన్టీఆర్ బయోపిక్ పై వస్తున్న వార్తలను ఖండించిన క్రిష్!

నందమూరి అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ చేతికివచ్చిన తర్వాత ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. మనదేశం సినిమాతోనే నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలయింది. అందుకే అదే గెటప్ తోనే తొలిషాట్ ని క్రిష్ తెరకెక్కించారు. అలాగే రీసెంట్ గా మాయాబజార్ సినిమా సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఆ గెటప్ కి సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇక నుంచి లీకులు జరగకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించి కొన్ని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా రానా, సావిత్రిగా కీర్తి సురేష్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయ్యారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వార్తలపై క్రిష్ స్పందించారు. తాము చెప్పకుండా.. సినిమా గురించి ఎవరెన్నీ చెప్పినా నమ్మవద్దని స్పష్టంచేశారు. కొన్ని పాత్రలకు ఇంకా ఆర్టిస్టులను సెలక్ట్ చేయలేదని వెల్లడించారు.  ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామన్నారు. మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తోంది. నిన్న హైదరాబాద్ కి వచ్చిన ఆమెకు బాలకృష్ణ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus