సాధారణంగా సినిమా ఎవరి వల్ల హిట్ అయ్యింది, సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై నిన్నమొన్నటివరకూ గొడవలు జరగడం చూశాం కానీ.. మొట్టమొదటిసారిగా ఏకంగా డైరెక్టర్ కార్డ్ క్రెడిట్ గురించి గొడవలు జరుగుతున్నాయి అది కూడా ఏదో ఫిలిమ్ ఛాంబర్ లో కాదు. ట్విట్టర్లో. ఇటీవల విడుదలైన “మణికర్ణిక” సినిమాకి కంగనా తన పేరుకి డైరెక్టర్ క్రెడిట్స్ తగిలించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై విడుదల ముందువరకు సైలెంట్ గా ఉన్న క్రిష్.. విడుదల తర్వాత మాత్రం నేను బంగారం లాంటి సినిమా తీస్తే నువ్వు దాన్ని నాశనం చేశావ్, అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది అంటూ ఆమెపై నిప్పులు చెరిగాడు.
ఈ విషయంలో కంగనా ఇప్పటివరకూ స్పందించలేదు కానీ.. ఆమె చెల్లెలు రంగోలీ మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. అక్క జర్మనీలో మణికర్ణిక సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది కాబట్టి తాను ఇలా రెస్పాండ్ అవుతున్నానని చెప్పి.. క్రిష్ కి కంగనా పంపిన పర్సనల్ వాట్సాప్ మెసేజస్ స్క్రీన్ షాట్స్ ను ట్విట్టర్ లో పెట్టింది. దానికి సమాధానంగా క్రిష్ “ఇదంతా కంగనా ఆడుతున్న నాటకం, నన్ను నేను డిఫెండ్ చేసుకునే పరిస్థితి రావడం బాధాకరం” అంటూ మరో ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్ల దాడులు ఎప్పటికీ ముగుస్తాయో ఏమో.