‘పుష్ప: ది రైజ్’ (Pushpa) సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కు (Allu Arjun) జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చినప్పుడు అందరూ ఆనందపడ్డారు. తెలుగు నుండి ఈ పురస్కార గౌరవం అందుకున్న తొలి నటుడు అని సంబరపడ్డారు. అయితే.. కొంతమంది మాత్రం స్మగ్లర్ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి గౌరవం ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దానికి ఆన్సర్ ఎవరూ చెప్పరు అని అనుకుంటే.. ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) చెప్పారు. ఏ అవార్డు అయినా నటన బట్టి ఇస్తారు.
అంతే తప్ప ఆ పాత్ర నైజం బట్టి కాదు. హాలీవుడ్‌లో ‘గాడ్ ఫాదర్’ సినిమాను చూసి గొప్ప సినిమాగా చేశాం. అంతేకానీ అది ఓ డాన్ జీవితం అని వదిలేయలేదు కదా. అలాగే స్మగ్లర్ జీవితమే పుష్ప. ఇందులో కథానాయకుడిని అణగదొక్కుతుంటారు. దాంతో ఆటవిక న్యాయమే కరెక్ట్ అని అతను నమ్ముతాడు. ఆ దారిలోనే ఎదిగి తానేంటో చూపిస్తాడు. అలాంటి వ్యక్తి జీవితాన్ని తెరపై ఎలా చూపించారు, ఆ పాత్రను అల్లు అర్జున్ ఎంత బాగా పోషించారు అనేదే చూస్తారు.
అది చూసే జాతీయ అవార్డు ఇచ్చారు. అంతేకానీ హీరో సూక్తులు చెబుతున్నాడా, మంచి చేస్తున్నాడా అనేది చూడరు అని మోహన్ కృష్ణ ఇంద్రగంటి చెప్పుకొచ్చారు. అలా ‘పుష్పకి అవార్డు’ ప్రశ్నకు ఓ ముగింపు పడినట్లు అయింది. ఇక ఇంద్రగంటికి అవార్డు తెచ్చిపెట్టిన ‘గ్రహణం’ గురించి మాట్లాడుత.. కళాత్మక చిత్రమని ఆ సినిమా తీయలేదని, డ్రామా కథగా దానిని రూపొందించామని చెప్పారు. తనకు కూడా ఆర్ట్ సినిమాలు బోర్ కొడతాయని చెప్పారాయన.
ఇక ప్రస్తుతం ఆయన ప్రియదర్శి (Priyadarshi) కథానాయకుడిగా ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) అనే సినిమా తెరకెక్కించారు. డిసెంబరు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవల వచ్చిన ప్రచార చిత్రం చూస్తుంటే వినోదాత్మక కథతో తెరకెక్కిన సినిమా అని అర్థమవుతోంది. మరి ఇంద్రగంటి ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.