ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దయా’ అనే వెబ్ సిరీస్.. ప్రేక్షకుల నుండి విశేషాదరణ సొంతం చేసుకుంది. పవన్ సాధినేని దీనికి దర్శకుడు. గతంలో ఇతను ‘ప్రేమ ఇష్క్ కాదల్’ .. ‘సావిత్రి’ .. ‘సేనాపతి’ వంటి సినిమాలు తెరకెక్కించాడు అని ఎక్కువ మందికి తెలిసుండదు. ఇతను సూపర్ టాలెంటెడ్. కానీ ఇంకా ఆశించిన బ్రేక్ రాలేదు. ఓ రకంగా ఇతనికి టైం కూడా కలిసి రావడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పుకొచ్చాడు.
పవన్ సాధినేని మాట్లాడుతూ.. “నారా రోహిత్ గారితో చేసిన ‘సావిత్రి’ సినిమా కథ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడిని. అది ఒక మంచి ప్రయత్నం అని నేను భావించాను. కానీ ఫలితం దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా తేడా కొట్టేసింది. ఆ సినిమా తర్వాత నేను కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. సెట్స్ పైకి వెళ్లే టైంలో హరికృష్ణగారి మరణం కారణంతో ఆగిపోయింది.
అటు తర్వాత బెల్లంకొండ గణేష్ ను నేనే హీరోగా పరిచయం చేయాల్సింది. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం.. 20 రోజుల పాటు షూటింగ్ కూడా చేశాము. కానీ కరోనా వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది. దాదాపు రెండేళ్ల వరకు ఆ ప్రాజెక్టు జోలికి వెళ్లలేకపోయాం.! తర్వాత నేను వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం జరిగింది. ఆ 20 రోజుల ఫుటేజ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది” అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ సాధినేని కామెంట్స్ తో ‘ ‘దయా’ దర్శకుడి దయనీయమైన పరిస్థితి’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.