ఎన్టీఆర్ జీవిత కథని ఆధారం చేసుకుని క్రిష్, బాలయ్య రూపొందించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మొదట తేజను డైరెక్టర్ గా అనుకున్నారు. ఏమైందో తెలీదు క్రిష్ సీన్లోకి వచ్చాడు. దీని గురించి తేజ కూడా ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. అయితే ఇన్నాళ్లకు ఆ కారణాన్ని వివరించాడు తేజ. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ బయోపిక్ నుండీ ఎందుకు తప్పుకున్నాడనేది క్లారిటీ ఇచ్చాడు.
తేజ మాట్లాడుతూ… “నేను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన బయోపిక్స్ అయిన ‘మహానాయకుడు’, ‘కథానాయకుడు’ చిత్రాలను నేను చూడలేదు. ఎన్టీఆర్ చరిత్ర లోతుల్లోకి వెళ్లిన తరువాత, నేనైతే ఆయనకు న్యాయం చేయలేనని అనిపించింది, అందువల్లే దర్శకత్వ బాధ్యతల నుండీ తప్పుకున్నాను, బాలకృష్ణతో గొడవలేమీ రాలేదు. ఇక ఈ సినిమాలు చూస్తే, నేనైతే ఎలా తీసుంటానో అన్న ఆలోచనలు చుట్టుముడతాయి, ఏ అభిప్రాయాన్ని అయినా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంటాను, ఎందుకొచ్చిన గోలని వాటిని చూడటం మానేసాను.
ఆ సినిమాలు చేయకపోవడం వల్ల నాకిప్పుడు మంచి పేరు వచ్చింది. నేను చేసుంటే సినిమా ఇంకా బాగా వచ్చుండేదన్న కొందరు కామెంట్లు చేస్తున్నారు. అటువంటి కామెంట్లను నేను పట్టించుకోలేదు, సినిమాలు ఆడకపోయినా, క్రిష్ లేదా బాలకృష్ణను తగ్గించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.