“నేనే రాజు నేనే మంత్రి”తో దాదాపు 14 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న తేజ ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. దాంతో అప్పటివరకూ తనతో సినిమా అంటేనే భయపడిన హీరోలందరూ ఒక్కసారిగా తేజ ఆఫీస్ కి వెళ్ళడం మొదలెట్టారు. అలా ఆ సూపర్ హిట్ అనంతరం తేజకి ఒకేసారి రెండు భారీ చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అందులో ఒకటి “ఎన్టీయార్” బయోపిక్, నందమూరి తారకరామారావు తనయుడు బాలయ్య టైటిల్ పాత్ర పోషిస్తుండడంతో ఈ ప్రొజెక్ట్ పై విపరీతమైన క్రేజ్ పెరిగింది. అలాగే “గురు”తో మంచి హిట్ సొంతం చేసుకొన్న వెంకటేష్ తదుపరి చిత్రానికి దర్శకత్వం కూడా తేజను వరించింది. ఈ రెండిట్లో ఏ సినిమా ముందు మొదలెట్టాలి, ఏది తర్వాత అనే విషయంలో కన్ఫ్యూజ్ అయిన తేజ రెండిట్నీ ఒకేసారి మొదలెట్టాలని ఫిక్స్ అయ్యి.. అనుకున్న ప్రకారం మొదలెట్టాడు కూడా.
అయితే.. సడన్ గా కారణాంతరాల వలన “ఎన్టీయార్” బయోపిక్ నుంచి బయటకొచ్చేసిన తేజ, ఆ తర్వాత వెంకటేష్ సినిమా మీద కాన్సన్ ట్రేట్ చేద్దామనుకొన్నాడు. కానీ.. వెంకటేష్ అప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో “F 2″కి కమిట్ అయిపోవడంతో.. ఇప్పుడు ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. తనకు అందులోబాటులో ఉన్న మరో కథానాయకుడు అక్కినేని నాగార్జునకు ఒక మంచి కథ చెప్పాడట. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న నాగార్జున.. ఈ రెండు సినిమాల్లోనూ తన షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో.. తేజ సినిమాను సెట్స్ మీదకు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడట. అన్నీ కుదిరితే జూన్ కల్లా నాగార్జున-తేజల సినిమా సెట్స్ మీదకు వచ్చేస్తుంది.