మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హీరోయిన్ అన్షు శరీరాకృతి గురించి వ్యాఖ్యానించిన త్రినాథరావు మాటలు నెటిజన్లను తీవ్రంగా కదిలించాయి. ‘‘మరింత బరువు పెరిగితే తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవుతుందని అన్షుకు చెప్పాను’’ అంటూ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా మారాయి. ఈ కామెంట్స్‌కి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
నెటిజన్లు, సినీ అభిమానులు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రినాథరావు సరదాగా చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం చుట్టూ ట్రోలింగ్ కొనసాగుతుండడంతో, దర్శకుడు స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. త్రినాథరావు ఓ వీడియో ద్వారా తన మాటల వల్ల ఎవరైనా బాధపడినట్లయితే, అందుకు క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.
‘‘మా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు. నేను ఎవరిని కించపరచాలని అనుకోలేదు. అయినప్పటికీ తప్పు తప్పే. ఎవరైనా నా మాటలకు బాధపడి ఉంటే క్షమించండి అని అడుగుతున్నాను’’ అని త్రినాథరావు స్పష్టం చేశారు. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రీతూ వర్మ పేరు గుర్తుపట్టకపోవడం వంటి సంఘటనలు కూడా నెటిజన్ల ట్రోలింగ్‌కి ఆహుతయ్యాయి. త్రినాథరావు వాటర్ బాటిల్ అడగడం వంటి చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పెద్దగా పెంచుతూ విమర్శలు గుప్పించారు. ఇది అల్లు అర్జున్ పుష్ప 2 ప్రెస్ మీట్ పై ట్రోల్ చేసినట్లు ఉండడంతో వివాదాన్ని మరింత పెంచింది.
దర్శకుడి సరదాగా చేసిన ప్రయత్నం పెద్ద సమస్యగా మారడం పట్ల సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మజాకా చిత్రం ఇప్పటికే మంచి అంచనాలు పొందినప్పటికీ, ఈ వివాదం ప్రభావం సినిమాపై ఉంటుందా అనే ఆందోళన నెలకొంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన టీజర్‌కు సానుకూల స్పందన వచ్చినా, ఈ వివాదం విడుదలకు ముందు ఇబ్బంది కలిగించేలా ఉంది. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో, సుందీప్ కిషన్, రీతూ వర్మ, అన్షు కీలక పాత్రల్లో నటించారు.
First Comment
Apologize Video