Game Changer Review in Telugu: గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రామ్ చ​రణ్ (Hero)
  • కియారా అద్వానీ (Heroine)
  • ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి, జయరాం, సముద్రఖని (Cast)
  • శంకర్ (Director)
  • రాజు - శిరీష్ (Producer)
  • తమన్ (Music)
  • ఎస్.తిరునవుకరాసు (Cinematography)
  • Release Date : జనవరి 10, 2025

2021లో అఫీషియల్ గా మొదలైన చిత్రం “గేమ్ ఛేంజర్” (Game Changer). శంకర్ (Shankar) తెలుగులో తీసిన మొదటి స్ట్రయిట్ సినిమా ఇది. దిల్ రాజు నిర్మాణంగా ఘనంగా ప్రారంభమై.. అనంతరం పలు సమస్యల కారణంగా షూటింగ్ డిలే అయ్యి మొత్తానికి 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమా మీద పెద్ద అంచనాలు లేవు, అందుకు కారణం శంకర్ (Shankar) మునుపటి చిత్రం “ఇండియన్ 2” రిజల్ట్. దాంతో.. “గేమ్ ఛేంజర్” (Game Changer) పరిస్థితి ఏంటి? దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని తెరకెక్కించిన దిల్ రాజు పరిస్థితి ఏంటి? అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. మరి శంకర్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? రాజమౌళి కర్స్ ను ఎన్టీఆర్ తరహాలో రామ్ చరణ్ కూడా బ్రేక్ చేశాడా? అనేది చూద్దాం..!!

Game Changer Review

కథ: సొంత జిల్లాకి కలెక్టర్ గా వచ్చిన రామ్ నందన్ (రామ్ చరణ్) అక్రమార్కుల మెడ మీద కత్తి పెట్టి మరీ వాళ్లు చేసే అరాచకాలకు తెర దింపుతాడు. ఆ క్రమంలో పెంచిన తండ్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) ఎప్పడు చనిపోతాడా అని ఎదురుచూసే కసాయి కొడుకు మరియు మినిస్టర్ అయిన బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య)తో తలపడాల్సి వస్తుంది.

రామ్ నందన్ నిజాయితీని భరించలేని మోపిదేవి అతడి మీద కేస్ పెట్టి మరీ కలెక్టర్ బాధ్యతలకు దూరం చేస్తే.. ఊహించని తీరులో రామ్ నందన్ ఏకంగా అభ్యుదయం పార్టీకి కీలక వ్యక్తిగా మారతాడు.

అయితే.. రామ్ నందన్ వర్సెస్ మోపిదేవిల యుద్ధం ఏ స్థాయికి చేరుకుంది? మోపిదేవి ముఖ్యమంత్రి అవ్వగలిగాడా? దాన్ని రామ్ నందన్ ఎలా ఎదిరించాడు? అనేది “గేమ్ ఛేంజర్” కథాంశం.

నటీనటుల పనితీరు: రామ్ నందన్ గా రామ్ చరణ్ నటన కంటే.. అప్పన్నగా రామ్ చరణ్ నటన అందర్నీ అలరిస్తుంది. ముఖ్యంగా అప్పన్న పాత్రలో నత్తి ఉన్న నాయకుడిగా రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా ట్రైలర్ లో కనిపించే ఫోన్ చేసే సీన్ లో చరణ్ నటనకి ఫిదా అవ్వాల్సిందే. రామ్ నందన్ గానూ ఆకట్టుకున్నాడు కానీ.. అప్పన్న ఎక్కువ మార్కులు కొట్టేశాడు.

ఎస్.జె.సూర్య ఎప్పట్లానే తన పాత్రలో వీరవిహారం చేశాడు. మోపిదేవికి ఉన్న పదవి పిచ్చి అతడి కళ్ళల్లో, బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

శ్రీకాంత్ ఆశ్చర్యపరిచాడు. ఇన్నాళ్ల కెరీర్లో శ్రీకాంత్ పోషించని పాత్ర లేదు కానీ.. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నెగిటివిటీ కనిపించకుండా నటించడం అనేది మాములు విషయం కాదు. శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగుంది.

అంజలికి మంచి పాత్ర లభించింది. పార్వతిగా ఆమె క్యారెక్టర్ కొన్నాళ్లు గుర్తుండిపోతుంది. కొండ దేవర పాటలో ఆమె డ్యాన్స్ & ఎక్స్ ప్రెషన్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి.

జయరాం కామెడీ టైమింగ్ ని మనో డబ్బింగ్ వాయిస్ డామినేట్ చేసింది. సముద్రఖని సినిమాలో ప్రేక్షకుడిలా మిగిలిపోయాడు.

ఇక కియారా అద్వానీ కేవలం పాటలు మరియు కొన్ని రొమాంటిక్ సీన్స్ కి పరిమితం అయిపోయింది. చరణ్ & కియారా కెమిస్ట్రీ బాగున్నప్పటికీ.. లవ్ ఎపిసోడ్స్ లో సహజత్వం లోపించి ఆమె పాత్ర కేవలం ఒక గ్లామర్ టచప్ గా మిగిలిపోయేలా చేసింది.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాలో చాలా మంచి పాటలున్నాయి. వాటిని ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది చిత్రబృందానికే తెలియాలి. అయితే.. అందరినీ అమితంగా ఆకట్టుకున్న “నానా హైరానా” పాటను కూడా సినిమా నుంచి కట్ చేయడం అనేది అర్థం కాని విషయం. తమన్ మాత్రం సినిమాకి 100% న్యాయం చేశాడు. పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాని తన శక్తిమేరకు ఎలివేట్ చేశాడు. అయితే.. కొన్ని పాటల ప్లేస్మెంట్ వర్కవుట్ అవ్వలేదు కానీ.. “అరుగు మీద” హృద్యంగా ఉండగా, “కొండ దేవర” సెకండాఫ్ కి మంచి జోష్ ఇచ్చింది. కోపర్యాప్ సాంగ్ లో చరణ్ డ్యాన్స్ మూమెంట్స్ అలరిస్తాయి.

సినిమాటోగ్రాఫర్ తిరు వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. రోబోటిక్ కెమెరాను ఎలివేషన్ షాట్స్ కోసం వినియోగించిన తీరు బాగుంది. ఈమధ్యకాలంలో రోబోటిక్ కెమెరాను అత్యధిక సన్నివేశాల కోసం “గేమ్ ఛేంజర్”లోనే వినియోగించారని చెప్పాలి. అలాగే.. కాలర్ గ్రేడింగ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ సినిమా కోసం మొదటిసారిగా వినియోగించిన ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ పనితనం ఎలా ఉందో తెలియాలంటే మాత్రం జనవరి 14న యాడ్ చేసే “నానా హైరానా” చూశాక అర్థమవుతుంది. ఒక టెక్నీషియన్ గా తిరు వర్క్ కమర్షియల్ సినిమాను బాగా ఎలివేట్ చేసింది.

తన కల అయిన శంకర్ సినిమా కావడంతో.. దిల్ రాజు ఎక్కడా రాజీపడలేదు. పాటల విషయంలోనే 75 కోట్లు ఖర్చు చేశానని దిల్ రాజు చెప్పుకోగా.. సినిమా మొత్తానికి 400 కోట్ల రూపాయలైంది. క్లైమాక్స్ ఫైట్ పీక్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ అని చెప్పొచ్చు.

దర్శకుడు శంకర్ తన మార్క్ ని “గేమ్ ఛేంజర్”(Game Changer) మీద వేయడంలో కాస్త తడబడ్డాడు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథలో దమ్ము ఉంది, కానీ.. అనవసరంగా ప్రేమకథను ఇరికించడం, అందుకోసం రాసుకున్న ఎపిసోడ్స్ సరిగా వర్కవుట్ అవ్వకపోవడంతో.. సినిమాకి ఆడియన్స్ చాలా చోట్ల డిస్కనెక్ట్ అయిపోతారు. ముందుగా ఈ కథ ప్యాన్ ఇండియన్ సినిమాగా తీసే స్థాయిది కాదు. తెలుగు లేదా తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేసి ఉంటే బాగుండేది. పొలిటికల్ సినిమా కావడం, ఆంధ్రా పాలిటిక్స్ కి సంబంధించి కొన్ని సెటైర్లు, సందర్భాలు ఉండడం అనేది మిగతా భాషల జనాలకి పెద్దగా కనెక్ట్ అయ్యే విషయం కాదు. అయితే.. “భారతీయుడు 2” కంటే చాలా బెటర్ సినిమా ఇది.

కానీ.. శంకర్ స్థాయి సినిమా మాత్రం కాదు. శంకర్ నుంచి ప్రేక్షకులు ఆశించేది అతిశయమే కానీ.. అది కూడా నమ్మకంగా, అందంగా ఉండాలి. ఆయన మునుపటి సినిమాలన్నిట్లో ఆ ఫార్మాట్ ను ఫాలో అయ్యారు. కానీ.. ఎందుకో ఈమధ్య అది లోపించింది. అందువల్ల గేమ్ ఛేంజర్(Game Changer) కథ పరంగా, నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా మంచి సినిమా అయినప్పటికీ.. ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక ఇబ్బందిపడుతుంది. ఓవరాల్ గా.. శంకర్ ఒక దర్శకుడిగా ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించలేకపోయారనే చెప్పాలి.

విశ్లేషణ: శంకర్ సినిమాల్లో లావిష్ నెస్ ఉంటుంది, షాక్ వాల్యూ ఉంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది. గేమ్ ఛేంజర్ (Game Changer) లో ఇవన్నీ ఉన్నాయి కానీ సరిగా పొసగలేదు. ముఖ్యంగా అనవసరమైన కమర్షియాలిటీ కారణంగా సినిమాలో ఎలివేట్ అవ్వాల్సిన ఎమోషనల్ ఎలిమెంట్స్ మరుగునపడిపోయాయి. అయితే.. 2024కి ముందు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ టైమ్ లో జరిగిన హడావుడి మరియు ఆంధ్ర రాజకీయాలు మరియు రాజకీయ నాయకుల మీద కాస్త అవగాహన కలిగినవాళ్ళకి ఈ చిత్రం నచ్చుతుంది. అన్నిటికీ మించి అప్పన్నగా రామ్ చరణ్ నటన, మోపిదేవిగా ఎస్.జె.సూర్య పెర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ వర్క్ కోసం సంక్రాంతి ఆనవాయితీగా “గేమ్ ఛేంజర్”ను చూడొచ్చు.

ఫోకస్ పాయింట్: ప్రెడిక్టబుల్ గేమర్!

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus