టాలీవుడ్‌లో తనకంటూ ఓ కొత్త కామెడీ టైమింగ్‌ని సృష్టించుకున్న దర్శకుల్లో త్రినాథరావు ఒకరు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయింది. అలాంటి వ్యక్తికి ఎవరితో ఎలా మాట్లాడాలి, హీరోయిన్ల గురించి ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది తెలియకుండా ఉంటుందా? కచ్చితంగా తెలిసే ఉంటుంది. కాబట్టి అలా మాట్లాడటాన్ని కావాలని చేసిన పనే అని చెప్పొచ్చు. అలాంటి పనులు ఆయన ఇటీవల ఒకే వేదిక మీద రెండు చేశారు. సందీప్ కిషన్ ‘మజాకా’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇదంతా జరిగతింది.
సందీప్ కిషన్, రీతూ వర్మ, అన్షు, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మజాకా’. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా సంక్రాంతికే వచ్చేది. కానీ సీజన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రాలేదు. అయితే ట్రైలర్ వచ్చింది. ఆ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు నక్కిన స్పీచ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుకంటే అందులో ఒకరిని టీజ్ చేశారు. మరొకరి గురించి మాట్లాడే క్రమంలో నోరు జారారు. దీంతో ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అన్షు లాంటి హీరోయన్ని ఎప్పుడో నేను యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడో.. ఇంకా చిన్నప్పుడో చూశాను. నాకైతే సరిగ్గా ఎప్పుడో గుర్తులేదు. ‘మన్మథుడు’ సినిమా చూసి ఏందిరా ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉంది అనుకునేవాణ్ని. ఆ అమ్మాయిని చూడటానికే ‘మన్మథుడు’ సినిమాకి వెళ్లేవాళ్లం. అలాంటి ఆమె ఇప్పటికీ అలానే ఉందా? కొంచెం సన్నబడ్డారు. కొంచెం తినండి తెలుగుకి సరిపోదు. ఇక్కడ అన్నీ కొంచెం ఎక్కువ.. ఉండాలి అన్నాను. ఫర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్ట్స్ టైమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అని త్రినాథరావు అన్నారు. (ఇక్కడ మేం రాసింది తక్కువే.. ఆయన ఇంకా అన్నారులెండి).
మరోవైపు ఆ స్పీచ్‌లోనే రీతూ వర్మ గురించి చెప్పబోయి.. ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఓ సీఎం పేరు తట్టక ఇబ్బంది పట్టారు అంటూ వైరల్ అవుతున్న వీడియో మాదిరిగా త్రినాథరావు ఇమిటేట్ చేశారు. అసలే ఆ విషయం సెన్సిటివ్‌గా ఉంది. ఈ సమయంలో ఇలా చేయడం సరికాదు. ఇదంతా చూస్తుంటే సినిమా విషయం వైరల్ అవ్వడానికే ఇలా చేశారేమో అనే డౌట్ కూడా వస్తోంది.