ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : 19 ఏళ్ళ ‘దిల్’ మూవీ గురించి దర్శకుడు వి.వి.వినాయక్ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • April 5, 2022 / 04:32 PM IST

వి.వి.వినాయక్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలకి సహాయ దర్శకుడిగా పని చేసిన ఆయన…’ఆది’ తో దర్శకుడిగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను టాలీవుడ్ కు అందించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు ఆయన. దర్శకులకి కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా? అనే ప్రశ్న ఎదురైతే దానికి మొదటి సమాధానంగా వి.వి.వినాయక్ గారి పేరు చెప్పుకోవచ్చు. అవును ఈయనకి చాలా మంది లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. మాస్ ఆడియెన్స్ లో వినాయక్ సినిమాలకి భారీ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం వినాయక్ గారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఆయన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘దిల్’ మూవీ రిలీజ్ అయ్యి నిన్నటితో 19 ఏళ్ళు పూర్తయ్యింది. కాగా ఈ మూవీ గురించి వినాయక్ గారు కొన్ని ఆసక్తికర విషయాలను ఫిల్మీ ఫోకస్ తో షేర్ చేసుకున్నారు. ఆ విషయాలు మీ కోసం :

ప్ర. ‘దిల్’ రిలీజ్ అయ్యి 19 ఏళ్ళు పూర్తవుతుంది? ఎలా ఫీలవుతున్నారు?

జ. అప్పుడే 19 ఏళ్ళు అయిపోయిందా.. అనిపిస్తుంది. మొన్న మొన్ననే ఆ సినిమా షూటింగ్ చేసాం అనిపిస్తుంది. ‘దిల్’ అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్.

ప్ర.’దిల్’ మాత్రమే కాదు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ స్టార్ట్ అయ్యి కూడా 19 ఏళ్ళు పూర్తవుతుంది. మీ మూవీతో ఆ బ్యానర్ లాంచ్ అయ్యింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ మూవీస్ ను అందిస్తూ దూసుకుపోతుంది. దాని గురించి ఎలా ఫీలవుతున్నారు?

జ. ఆ బ్యానర్ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. రాజు … ‘దిల్’ రాజు అయ్యారు. ‘దిల్’ సినిమాకి అతను నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మూవీ అంత బాగా వచ్చింది అంటే అతని ప్రోత్సాహం ఎంతో ఉంది. శిరీష్- లక్ష్మణ్ లను కూడా ప్రత్యేకంగా అభినందించాలి.

ప్ర. మళ్ళీ ఈ బ్యానర్లో ఇంకో మూవీ ఎందుకు చేయలేకపోయారు?

జ. ‘చెయ్యాలి’ అని ప్రతీరోజు అనుకుంటూనే ఉంటాను. కానీ అది ‘దిల్’ ను మించి హిట్ అవ్వాలి. చేసెయ్యాలి కాదా అని ఏది పడితే అది చేయకూడదని నేను అనుకోవడం.. అలాగే ఆయన(నిర్మాత దిల్ రాజు) గారు సుకుమార్, వాసు వర్మ, భాస్కర్.. ఇలా కొత్త డైరెక్టర్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు కాబట్టి.. మా కాంబో డిలే అయ్యింది.

ప్ర. ఇదే బ్యానర్లో మీరు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు కదా.. ఆ మూవీ ఏమైంది?

జ. కథ బాగా నచ్చింది. ఓకె చెప్పేసాను. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ స్క్రిప్ట్ విషయంలో అందరికీ కాన్ఫిడెన్స్ లేదు. అందుకే ‘సీనయ్య’ ఫినిష్ చేయలేకపోయాం.

ప్ర. ‘దిల్’ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

జ. ‘జయం’ ఓపెనింగ్ కు వెళ్ళినప్పుడు నేను నితిన్ ను చూసాను. అతనితో ఓ యూత్ ఫుల్ సబ్జెక్టు చేస్తే బాగుంటుంది అనిపించింది. అతన్ని దృష్టిలో పెట్టుకునే ‘దిల్’ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను.

ప్ర. ‘దిల్’ మూవీకి ఫస్ట్ అనుకున్న హీరో నితినేనా?

జ. ‘దిల్’ కోసం నితిన్ ను అనుకోవడం కాదు.. నితిన్ వల్లే ‘దిల్’ కథ రెడీ చేసుకున్నాను. ఈ కథని ముందుగా ఏ హీరోకి చెప్పలేదు.

ప్ర. హీరోయిన్ నేహా కూడా ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ కాదు అని విన్నాం.. నిజమేనా?

జ. ముందుగా ముగ్గురు, నలుగురు హీరోయిన్లకి లుక్ టెస్ట్ చేసాం. చివరికి నేహా బాగుంది అనిపించింది. ఆమెను ఫైనల్ చేసాం. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది.

ప్ర.’దిల్’ కు నితిన్ తో ఎందుకు డబ్బింగ్ చెప్పించలేదు?

జ. ‘జయం’ సినిమాలో నితిన్ కు శివాజీ డబ్బింగ్ చెప్పాడు. ‘దిల్’ లో నితిన్ పాత్రకి కూడా అతనితోనే చెప్పించెయ్యాలని ముందుగా అనుకున్నాను.’జయం’ చూసాక నాకు ఆ వాయిస్ రిజిస్టర్ అయిపోయింది. అందుకే శివాజీతోనే చెప్పించేసాము.

ప్ర.’దిల్’ సినిమా రిలీజ్ అయ్యాక మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు?

జ. చిరంజీవి గారు..! ఆయనకి ‘దిల్’ బాగా నచ్చింది. ‘ఠాగూర్’ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ‘దిల్’ రిలీజ్ అయ్యింది. ‘చాలా బాగా తీసావ్’ అంటూ అన్నయ్య నన్ను ప్రశంసించారు.

ప్ర.’దిల్’ మూవీలో కామెడీ ట్రాక్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.. కదా?

జ. అవును యూత్.. సమ్మర్ లో రిపీటెడ్ గా ఈ మూవీ చూడ్డానికి వచ్చారు అంటే కామెడీ కూడా ఓ కారణం అని చెప్పాలి.

ప్ర. అనుకున్న బడ్జెట్ లో ‘దిల్’ ను కంప్లీట్ చేశారా? బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాబట్టిందా?

జ.డెఫినెట్ గా అనుకున్న బడ్జెట్ లోనే మూవీని ఫినిష్ చేసాము. ఈ మూవీ సూపర్ ప్రాఫిట్స్ ను రాబట్టింది. టీం అంతా హ్యాపీ. నిర్మాత, బయ్యర్లు బాగుంటే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు.

ప్ర. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ఎంతవరకు ఫినిష్ అయ్యింది..!

జ. ఇంకో 8 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది ఫినిష్ అయితే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే..!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus