దిశ రేప్ కేసు సమయంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఆ పని చేసినవారికి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై చాలామంది గళం వినిపించారు. ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలు దిశ రేప్ కేసుకు సంబంధించి ట్వీట్లు పెట్టారు. అయితే వారి ట్వీట్లు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కించేలా ఉన్నాయి. ఇంతకీ ఏమైందంటే…
2019లో హైదరాబాద్లో దిశ హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో సంచలనంగా మారిన ఆ కేసుకు సంబంధించి చాలామంది ట్వీట్లు, పోస్టులు చేశారు. మీరు కూడా చేసే ఉంటారు. లేదంటే చూసుంటారు. అయితే ఆ ట్వీట్లలో బాధితురాలి అసలు పేరును చాలామంది ట్వీట్లు, పోస్టలో పేర్కొన్నారు. అత్యాచార, హత్యాచార బాధితురాలి పేరు, ఆచూకీని తెలిపేలా ఎవరూ మాట్లాడకూడదు. ఎక్కడా ప్రస్తావించకూడదు. దీన్ని మరచిన సెలబ్రిటీలు ఆమె పేరును పోస్టుల్లో రాసుకొచ్చారు. దీంతో వారందరిపై కేసులు నమోదు చేయాలని న్యాయవాది గౌరవ్ గులాటీ… దిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గౌరవ్ గులాటీ పిటిషన్లో మొత్తంగా 38 మందిని ప్రస్తావించారు. సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీమండీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు గౌరవ్. దానిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్… టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితోపాటు క్రీడాకారులు హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు.