బుల్లితెర ‘బాహుబలి’ గా చెప్పుకునే ‘కార్తీక దీపం’ సీరియల్ మార్చి 30నాటికి 1000 ఎపిసోడ్లు పూర్తిచేసుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దాంతో ‘కార్తీక దీపం’ టీం అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 2017 సెకండ్ హాఫ్ లో ప్రారంభం అయిన ఈ సీరియల్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం విశేషం. ఈ సీరియల్ ద్వారా కార్తీక్(పరిటాల నిరుపమ్), దీప(ప్రేమి విశ్వనాథ్), సౌందర్య(అర్చనా అనంత్), మోనిత(శోభా శెట్టి) పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి.
సోషల్ మీడియాలో వీరి పాత్రల పై బోలెడన్ని మీమ్స్ కూడా వస్తుండడం.. అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇదిలా ఉండగా.. ఈ సీరియల్ లో నా పాత్ర నాకే నచ్చడం లేదంటూ తాజాగా డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ చేసిన కామెంట్స్ పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. నిరుపమ్ మాట్లాడుతూ.. “కార్తీక్ పాత్రలో నటించడం నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. దీపను అనుమానించడం మొదలు పిల్లలపై ప్రేమ… ఇలా ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి.
నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర చేసింది ఈ పాత్ర. బుల్లితెర పై అలాంటి అవకాశం అందరికీ దొరకదు. అయితే ఒక సామాన్య ప్రేక్షకుడిగా అయితే కార్తీక్ పాత్ర నాకు నచ్చడం లేదు. సీరియల్ ప్రారంభం నుండీ ఆధారం లేని ఆరోపణలను నమ్మేసి దీపను అనుమానించడం, ఆమెను కించపరచడం నన్ను కూడా బాధ పెట్టాయి. కానీ సీరియల్ కథ ప్రకారం తప్పడం లేదు. దీపను బాధ పెట్టడం గురించి బయట చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు.
దీపకి ఎప్పుడు న్యాయం చేస్తావని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవి నాకు అలవాటు అయిపోయాయి. అంతేకాదు నాకు బెదిరింపు మెసేజ్‌లు, ఫోన్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ గారికి, స్టార్ మా యాజమాన్యానికి అవి చూపించగా నా పాత్రలో కొన్ని కొన్ని మార్పులు చేస్తూ వచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు.