ఇ ఈ

నీరజ్ శ్యామ్ కథానాయకుడిగా రామ్ గణపతిరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఇ ఈ”. ప్రేమించుకొనే ఒక అబ్బాయి-అమ్మాయి ఆత్మలు వారికి తెలియకుండా రివర్స్ లో మారిపోయి.. అబ్బాయి శరీరంలో అమ్మాయి ఆత్మ, అమ్మాయి శరీరంలోకి అబ్బాయి ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ అండ్ హీరోయిన్స్ గ్లామర్ ఆడియన్స్ ను ఓ మేరకు ఆకట్టుకొన్నాయి. మరి సినిమా ఏస్థాయిలో అలరించిందో చూద్దాం..!!

కథ : సిద్ధూ (నీరజ్ శ్యామ్) ఆడవాళ్ళంటే సదభిప్రాయం లేని యువకుడు. అందువల్ల ఎల్లప్పుడూ ఆడవాళ్లని తిడుతూ ఉంటాడు. అందువల్ల నివసించే ఏరియా మొదలుకొని ఆఫీసులోనూ సిద్ధూకి అమ్మాయిలతో ఎప్పుడూ గొడవలే. ఒకానొక సందర్భంలో తన కొత్త లేడీ బాస్ హాసిని (నైరా షా)తో కూడా గొడవ జరగడంతో కోపంతో లంభసింగిని దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఓ స్వామి విని.. ఆడవారి గురించి సిద్ధూ ఆలోచనా విధానం మారాలంటే వారి మనసులో ఏమనుకొంటున్నారా సిద్ధూకి వినపడేలా శపిస్తాడు. అయితే.. ఆ శాపాన్ని వరంగా మార్చుకొని సిద్ధూ కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా డెవలప్ అవుతుంటాడు. ఇంతలో.. మళ్ళీ ఆ స్వామీజీ సుద్ధూ జీవితంలోకి వచ్చి ఈసారి ఏకంగా సిద్ధూ-హాసినిల ఆత్మలు ఇంటర్ ఛేంజ్ (సిద్ధూ శరీరంలోకి హాసిని ఆత్మ, హాసిని శరీరంలోకి సిద్ధూ ఆత్మ) వచ్చేలా శపిస్తాడు. అసలు స్వామీజీ అలా ఎందుకు శపించాడు. స్వామీజీ శాపం నుండి సిద్ధూ-హాసిని బయటపడగలిగారా లేదా? అనేది “ఇ ఈ” కథాంశం.

నటీనటుల పనితీరు : స్త్రీ ద్వేషిగా, మధ్యతరగతి యువకుడిగా పర్వాలేదనిపించే స్థాయిలో నటించిన నీరజ్ శ్యామ్.. సెకండాఫ్ లో అమ్మాయిలా నటించడం కోసం హోమ్ వర్క్ వలన… ఫస్టాఫ్ లోనూ అతడి హావభావాల్లో ఆడతనం కనిపిస్తుంది. మొదటి సినిమా అయినప్పటికీ రెండు విభిన్నమైన షేడ్స్ ను నైరా షా అద్భుతంగా పోషించింది. అందంతోపాటు అభినయ సామర్ధ్యం సమానంగా ఉన్న ఈ అమ్మడికి నటిగా మంచి భవిష్యత్ ఉంది.
చాలా కాలం తర్వాత సీనియర్ కమెడియన్ సుధాకర్ తండ్రి పాత్రతో రీఎంట్రీ ఇచ్చారు. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకొన్నారు. మిగతా క్యారెక్టర్స్ లో కొందరు సీనియర్ ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : ఏ.ఆర్.రెహమాన్ కి అసిస్టెంట్ అయిన కృష్ణ చేతన్ నేపధ్య సంగీతం మరియు బాణీల విషయంలో ఆశ్చర్యపరిచాడు. పాటలు చూడ్డానికి పెద్దగా బాగోలేకపోయినా క్వాలిటీ & సౌండ్ మిక్సింగ్ చాలా బాగున్నాయి. అమర్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. క్వాలిటీ ఔట్ పుట్ అదిరింది. ఓవరాల్ గా పరిమిత బడ్జెట్ తో ఈస్థాయి సినిమా అవుట్ పుట్ ఇవ్వడం అనేది టెక్నీషియన్స్ ప్రతిభకు నిదర్శనం.

ఇక దర్శకుడు రామ్ గణపతిరావ్ రాసుకొన్న కథలో ఉన్న కొత్తదనం, స్క్రీన్ ప్లేలో లేదు. అయినా.. ఒక మనిషికి అవతలి వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడో వినబడే కాన్సెప్ట్ తో 2012లో శ్రీకాంత్ హీరోగా “లక్కీ” అనే సినిమా వచ్చింది. అలాగే.. సౌల్స్ ఎక్చేంజ్ అనేది కూడా “రావు గోపాల్రావు” అనే సినిమాలోనూ చూశాం. ఇక అమ్మాయి శరీరంలోకి అబ్బాయి ఆత్మ ప్రవేశించడం అనేది కూడా పలు హాలీవుడ్ అండ్ సౌత్ సినిమాల్లో చూసే ఉంటాం. అయితే.. దర్శకుడు సేమ్ కంటెంట్ తో కాస్త కొత్తగా కామెడీజీ జోడించి కథను నడిపిన విధానం మోస్తరుగా ఉన్నా.. అనవసరమైన సైడ్ ట్రాక్స్ ఎక్కువయ్యాయి. అందువల్ల సినిమాలో అసలు కంటెంట్ తక్కువ, కొసరు కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్ గా నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకొన్న దర్శకుడు సీన్ కంపోజింగ్ లో పరిణితి ప్రదర్శించక విఫలమయ్యాడు.

విశ్లేషణ : కాన్సెప్ట్ సినిమాలు రావడం అనేది మంచిదే.. కానీ ఆ కాన్సెప్ట్ ను సరైన స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అలా కుదరనప్పుడు కథనమైనా సరిగా ఉండాలి. ఈ రెండు లేకపోవడంతో.. “ఇ ఈ” కథ కొత్తగా ఉన్నా ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus