ఈ నగరానికి ఏమైంది

  • June 29, 2018 / 04:07 AM IST

“పెళ్ళిచూపులు” చిత్రంతో అప్పటివరకూ మూలనపడిన ఫ్లో సౌండ్ & సింక్ సౌండ్ టెక్నాలజీని ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసి వారి మెప్పును పొందడమే కాకుండా నేషనల్ అవార్డ్ ను సైతం గెలుచుకున్న తరుణ్ భాస్కర్ మరో డిఫరెంట్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల్ని పలకరించాడు. అదే “ఈ నగరానికి ఏమైంది?”. సురేష్ బాబు నిర్మాణంలో రూపొందిన ఈ క్రేజీ ఎంటర్ టైనర్ ట్రైలర్ & సాంగ్స్ యూత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. మరి సినిమా కూడా అదే స్థాయిలో అలరించిందో లేదో చూద్దాం..!!

కథ:
ఒక మంచి షార్ట్ ఫిలిమ్ తీసి.. ఆ షార్ట్ ఫిలిమ్ ద్వారా ఫిలిమ్ మేకర్స్ గా సెటిల్ అవుదామనుకొంటారు వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్ గోమటం), కార్తీక్ (సాయి సుశాంత్ రెడ్డి), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమను). అయితే.. ఈ నలుగురు స్నేహితులు ప్లాన్ చేసుకొన్నట్లుగా ఏదీ జరగకపోవడంతో.. వివేక్ ఐ.టి ఎంప్లాయ్ గా సెటిలైతే, కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఉపేంద్ర ఎడిటర్ గా, కార్తీక్ ఓ బార్ మేనేజర్ గా సెటిల్ అవుతారు. అయితే.. ఎవరికీ తాము చేస్తున్న ఉద్యోగాల్లో సంతృప్తి ఉండదు. ఏదో మిస్ అవుతున్నాం అని ప్రతిక్షణం ఫీల్ అవుతూనే ఉంటారు.
ఈలోపు కార్తీక్ కి పెళ్లి సెట్ అవ్వడంతో.. మంచి మందు సిట్టింగ్ లో కూర్చున్న వివేక్ & గ్యాంగ్ ఊహించని విధంగా గోవా చేరుకొంటారు. అనూహ్య పరిణామాల కారణంగా మళ్ళీ ఓ షార్ట్ ఫిలిమ్ తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాలుగేళ్ల క్రితమే షార్ట్ ఫిలిమ్స్ ను పక్కన పెట్టేసిన వివేక్ & టీం మళ్ళీ షార్ట్ ఫిలిమ్ తీయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈసారి సక్సెస్ అయ్యారా? ఈ నలుగురు స్నేహితులు చివరికి జీవితంలో ఏం సాధించారు? వంటి ప్రశ్నలకు తరుణ్ భాస్కర్ చెప్పిన సరదా సమాధానాల సమాహారమే “ఈ నగరానికి ఏమైంది?” చిత్రం.

నటీనటుల పనితీరు:
విశ్వక్ సేన్ యాటిట్యూడ్ బాగుంది, సాయి సుశాంత్ రెడ్డి నిజాయితీ బాగుంది, వెంకటేష్ కాకుమను అమాయకత్వం బాగుంది. వీటన్నిటికీ మించి అభినవ్ చతురత ఇంకా బాగుంది. నలుగురు వ్యక్తులు నటించినట్లుగా ఎక్కడా కనిపించదు, అనిపించదు. ఏదో.. నలుగురు నిజమైన స్నేహితుల మధ్య వాళ్ళకి తెలియకుండానే కెమెరా పెట్టేస్తే, ప్రేక్షకులందరూ ఆ కెమెరా లైఫ్ ఫీడ్ ను థియేటర్ లో చూస్తున్నట్లుగా ఉంటుంది. ఏ ఒక్క నటుడిలోను ఫోర్స్డ్ ఎమోషన్స్ కనిపించవు, కెమెరా తన చుట్టుపక్కల ఉందన్న ధ్యాస కనిపించదు. అది దర్శకుడి గొప్పదనం కావొచ్చు, కెమెరామెన్ నైపుణ్యం కావచ్చు.. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఫలానా చోట కెమెరా ఉంది కాబట్టి సదరు నటుడు/నటి ఇటు వైపు చూసి నటిస్తుంది అనిపించదు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమనులు ఒకెత్తు అయితే.. అభినవ్ గోమటం ఒక్కడూ ఒకెత్తు. “మళ్ళీ రావా”లో మంచి నటుడు అని ప్రూవ్ చేసుకొన్న అభినవ్ “ఈ నగరానికి ఏమైంది?”తో ఒన్నాఫ్ ది బెస్ట్ కమెడియన్ గా నిలిచాడు. సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ కానివ్వండి, స్క్రీన్ ప్రెజన్స్ లేదా ఎక్స్ ప్రెషన్స్ తో కానివ్వండి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. అన్నిటికంటే ముఖ్యంగా వివేక్ తో మందు కొట్టేప్పుడు పక్కనే భయంభయంగా బిక్క మొహం వేసుకొని కూర్చునే సన్నివేశంలో అభినవ్ నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ లు హీరోయిన్స్ లా ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం కాకుండా కథలో భాగమై, కథనానికి ఉతమిచ్చారు. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అందరు సహజంగా కనిపిస్తారు. అందరు కొత్తవాళ్లే.. కానీ వాళ్ళలో మనకి మన నటులు కాదు మన ఇంటిపక్కన ఆంటీ లేదా అంకుల్ కనిపిస్తారు.

సాంకేతికవర్గం పనితీరు:
సాధారణంగా కొన్ని ఇంగ్లీష్ లేదా కొరియన్ సినిమాలు చూసినప్పుడు సన్నివేశంతో సంబంధం లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ కే విపరీతంగా కనెక్ట్ అయిపోతుంటాం. “ఈ నగరానికి ఏమైంది?” విషయంలోనూ అదే జరుగుతుంది. అందుకు కారణం వివేక్ సాగర్. తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో వివేక్ సాగర్ ఓ నవ కెరటం. ఈ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ట్యాగ్ కోసం గనుక మనోడు వెంపర్లాడకపోతే.. భవిష్యత్ సంగీత దర్శకులకు ఓ నిఘంటువుగా నిలవగల సత్తా ఉన్న సంగీత దర్శకుడు వివేక్ సాగర్. పాటలేమిటి, నేపధ్య సంగీతం ఏమిటి.. ప్రతీదీ ప్రేక్షకుడి మనసులో రిపీటవుతూనే ఉంటుంది.

“నికేత్ బొమ్మిరెడ్డి” ఈ పేరును గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్ లో ఇతను క్రియేట్ చేసే కొత్త రికార్డులు తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఖాయం. కోట్లకి కోట్లు తగలేస్తుంటేనే కెమెరా వర్క్ విషయంలో రిచ్ నెస్ తప్ప ఏమీ కనిపించడం లేదు. అలాంటిది.. “ఈ నగరానికి ఏమైంది?” సినిమా చూస్తున్నంతసేపూ కెమెరా యాంగిల్ ఎలా కంపోజ్ చేసుకొన్నాడు, ఎక్కడ కెమెరా పెట్టాడు అనే ఆలోచన సినిమాని చాలా సరదాగా చూస్తున్న సదరు ప్రేక్షకుడికి మాత్రమే కాదు చాలా సీరియస్ గా చూస్తున్న విశ్లేషకుడికి కూడా రాదు. అసలు లైటింగ్ అనేది అవసరం లేకుండా సినిమా తీయొచ్చా అనే పిచ్చి ప్రశ్నకు నికేత్ బొమ్మిరెడ్డి ఇచ్చిన సమాధానం “ఈ నగరానికి ఏమైంది?” చిత్రం.

ఎడిటర్ రవితేజ గిరిజాల ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ప్రేక్షకుడికి కలిగించడానికి గట్టిగా ప్రయత్నించాడు కానీ.. ఫలితం కాస్త తేడా కొట్టింది. కన్ఫ్యూజన్ కి క్లారిటీకి చాలా చిన్న తేడా ఉంటుంది. స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజన్ ఆడియన్స్ కి క్లారిటీ ఇవ్వాలి. లేదా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఎంటర్ టైన్ చేస్తున్నామన్న క్లారిటీ ఎడిటర్ కి ఉండాలి. ఈ మీమాంసలో ఎక్కడో చిన్న చిన్న తప్పులు దొర్లాయి. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. కమ్మని భోజనం తింటున్నప్పుడు మధ్యలో చిన్న పలుకు కళ్లుప్పు నోటికి తగిలితే ఎలా ఉంటుందో స్క్రీన్ ప్లే కారణంగా క్రియేట్ అయిన చిన్న చిన్న తప్పుల కారణంగా ఏర్పడిన డిస్ట్రాక్టడ్ ఫీలింగ్ అలానే ఉంటుంది.

ఇక మన దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి మాట్లాడుకోవాలి..
“పెళ్లి చూపులు” చిత్రంతో న్యూఏజ్ ఫిలిమ్ మేకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తరుణ్ భాస్కర్ “ఈ నగరానికి ఏమైంది?” చిత్రంతో తన ప్రతిభను మరోమారు సక్సెస్ ఫుల్ గా ప్రూవ్ చేసుకొన్నాడు. అయితే.. “పెళ్ళిచూపులు” మేజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. కొత్తగా ట్రై చేస్తుంటే మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు అనే ప్రశ్న రావొచ్చు.. ఇక్కడ రిపీట్ చేయడం అంటే ఆస్థాయిలో అలరించలేకపోయాడు. అందుకు కారణం ఎంచుకొన్న జోనర్. “పెళ్ళిచూపులు”తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన తరుణ్ “ఈ నగరానికి ఏమైంది?”తో కేవలం యూత్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేశాడు. సినిమాలు చూసేదీ ఎలాగూ యూత్ ఆడియన్సే కాబట్టి సినిమా హిట్ అని ఫిక్స్ అయ్యేలోపు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి లేదంటే హిట్స్ గా నిలిచిపోయాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంతో బడ్డీ కామెడీ అనే డిఫరెంట్ జోనర్ ను తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశాడు. సింగిల్ లైన్ డైలాగ్స్, కామెడీ సీన్స్ ను తనదైన శైలిలో అద్భుతంగా రాసుకొన్న తరుణ్ భాస్కర్.. ప్రేక్షకుల్ని నవ్వించడం మీద పెట్టిన కాన్సన్ ట్రేషన్, అదే ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం పెట్టలేదు. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా సరిగ్గా సెట్ అయ్యుంటే నా సామిరంగా సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది. సినిమాను ఎంజాయ్ చేయడానికి, ఇన్వాల్వ్ ఇవ్వడానికి చాలా చిన్న తేడా ఉంటుంది. ఎంజాయ్ చేసిన సినిమా ఒక వారం గుర్తుంటే.. ఇన్వాల్వ్ చేసే సినిమా మాత్రం మనతో ప్రయాణం చేస్తుంది, సినిమాలోని పాత్రలు మనతో ప్రయాణం చేస్తాయి. తరుణ్ భాస్కర్ మళ్ళీ క్రియేట్ చేయలేకపోయిన మ్యాజిక్ ఇదే. ప్రేక్షకుల్ని 140 నిమిషాలపాటు మనస్ఫూర్తిగా నవ్వించాడు కానీ.. కథలో ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. పైగా.. కథ-కథనం “జిందగీ న మిలేగీ దుబారా, దిల్ చాహతాహై, హ్యాంగోవర్” చిత్రాలను తలపించడం కూడా ఒన్నాఫ్ ది మైనస్ గా చెప్పుకోవచ్చు. ఒక రచయితగా ఈసారి బొటాబోటి మార్కులతో పాస్ అయిన తరుణ్ భాస్కర్ ఒక ఫిలిమ్ మేకర్ గా ఫెయిల్ అవ్వలేదు. “ఈ నగరానికి ఏమైంది?” తప్పకుండా ఈ ఏడాది డీసెంట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. కానీ.. తరుణ్ లాంటి ఒక అద్భుతమైన ఫిలిమ్ మేకర్ నుంచి కామెడీ సీన్స్ మాత్రమే కాక ఇంకా చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్న ప్రేక్షకులను తన మూడో చిత్రంతో పూర్తిస్థాయిలో సంతృప్తపరుస్తాడాని ఆశిద్దాం.

విశ్లేషణ:
హలో డియర్ ఆడియన్,
నీ గ్యాంగ్ తో “ఈ నగరానికి ఏమైంది?” సినిమాకి వెళ్ళు.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తావ్, నవ్వుకుంటావ్, కాలేజ్ డేస్ గుర్తు చేసుకొంటావ్. ఇంతకంటే ఒక యూత్ ఫుల్ కామెడీ ఫిలిమ్ నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తావ్ చెప్పు నువ్వు.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus