మనది డెమోక్రిటిక్ కంట్రీ అని మనకు మనమే పదిసార్లు గుర్తుచేసుకొని మరీ గర్వపడుతుంటాం. కానీ.. ప్రస్తుతం మన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు కానీ సగటు మనిషికి అందుబాట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, పరిధి దాటిపోతున్న ప్రజాప్రతినిధుల అవినీతి చూస్తుంటే మాత్రం “ఇలాంటి దేశంలో ఎలా బ్రతకగలమో” అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ జయప్రకాష్ నారాయణ, కేజ్రీవాల్ లాంటి నాయకుకు సామాన్యుడికి అండగా నిలిచినట్లు కనిపించినా, ఆనందించేలోపే వారు కూడా కనుమరుగవుతున్నారు. పోనీ దేశ భవిష్యత్ అయిన యువతకు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తే బాగుంటుంది కదా అనుకొంటే.. సీనియర్లు తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామో అనే భయంతో వారిని తోక్కేస్తున్నారు.
అలా సీనియర్ల మరియు నీచ రాజకీయాల కారణంగా తొక్కివేయబడ్డ యువకుడు/నటుడు/నిర్మాత విశాల్. జయలలిత మరణానంతరం సరిగ్గా సంవత్సరం తర్వాత తమిళనాడులోని ఆర్.కె నగర్ నియోజకవర్గం బై ఎలెక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఘనంగా నామినేషన్ వేసిన ఒక్కరోజులోనే విశాల్ నామినేషన్ ను ఎలెక్షన్ కమిషన్ తిరస్కరించింది. వెంటనే విశాల్ తాను సబ్మిట్ చేసిన పత్రాలకు ఆధారాలు చూపడంతో మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ.. అర్ధరాత్రి విశాల్ నామినేషన్ చెల్లదు అంటూ తిరస్కరించింది. ఇక చేసేది లేక విశాల్ కూడా మిన్నకుండిపోయాడు.
అయితే.. ఈ తిరస్కార పర్వం వెనుక తమిళనాడు రూలింగ్ పార్టీ హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. జయలలిత అత్యధిక మెజారిటీతో గెలిచి సీయంగా తమిళనాడుని పరిపాలించిన నియోజకవర్గం అది. ఆమె మరణానంతరం వెంటనే బై ఎలెక్షన్స్ నిర్వహించమని ఎలక్షన్ కమిషన్ నోటీసు జారీ చేసినప్పటికీ.. ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం సబబు కాదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పళని స్వామి బదులివ్వడంతో.. ఏడాది తర్వాత ఇప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అసలే పార్టీలో ముసలం రావడంతో ఈ బై ఎలెక్షన్ లో భారీ స్థాయిలో మెజారిటీ రావడం రూలింగ్ పార్టీకి కీలకం కానుంది. అసలే ఆర్.కే.నగర్ లో తెలుగువారి సంఖ్య ఎక్కువ. అందుకే అక్కడ నుండి పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన విశాల్ తోపాటు జయలలిత చెల్లెలి కూతురు దీప నామినేషన్ ను కూడా తిరస్కరింపజేశారు రూలింగ్ పార్టీ పెద్దలు. ఈ వ్యవహారం చూస్తుంటే.. ఇప్పుడప్పుడే తమిళనాట నీచ రాజకీయాల హవా తగ్గేలా కనిపించట్లేదు.