నందు, పునర్నవి జంటగా కోటి వద్దినేని దర్శకత్వంలో రూపొందిన లవ్ థ్రిల్లర్ “ఎందుకో ఏమో”. నోయల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించగలదో చూద్దాం..!!
కథ : జీవితంలో ధ్యేయంతోపాటు కుటుంబ విలువలు తెలిసిన కుర్రాడు కార్తీక్ (నందు). మంచి ఉద్యోగం, కారు, ఇల్లు అన్నీ తన కష్టార్జితంతో కొనుక్కోంటాడు. ఇక మంచి అమ్మాయిని చేసుకొని సెటిల్ అయిపోతే బెటర్ అనుకొంటున్న తరుణంలో తారసపడుతుంది హారిక (పునర్నవి). తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. లక్కీగా తను పనిచేసే ఆఫీస్ లోనే జాయినవుతుంది హారిక. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ మొదలయ్యింది అనుకొనే టైమ్ కి కథలోకి ఎంటరవుతాడు ప్రిన్స్ (నోయల్). చెడు మార్గంలో డబ్బులు సంపాదించే ప్రిన్స్ కి అమ్మాయిలంటే మోజు. డబ్బుతో కొందర్ని సొంతం చేసుకొంటాడు లేదా ప్రేమిస్తున్నాని అబద్ధం చెప్పి కొందర్ని వాడుకొంటాడు.
కట్ చేస్తే.. కార్తీక్-ప్రిన్స్ స్నేహితులు కావడంతో హారిక విషయంలో చిన్న బెట్ వేసుకొంటారు. స్వచ్చమైన ప్రేమతో దగ్గరవ్వడానికి ప్రయత్నించే తనకే హారిక సొంతమవుతుందని కార్తీ, కాదు డబ్బుతో మరిపించే తన పక్కలోకి వస్తుందని ప్రిన్స్ బెట్ వేసుకొంటారు.
అయితే.. కార్తీక్ నమ్మకాన్ని పోగొడుతూ హారిక మెలమెల్లగా ప్రిన్స్ కి దగ్గరవుతుంది. కాకపోతే హారికకి ఈ విషయంలో చిన్న లెక్క ఉంటుంది. ఏమిటా లెక్క ? చివరికి హారిక ఎవరికి దగ్గరైంది? అనేది “ఎందుకో ఏమో” కథాంశం.
నటీనటుల పనితీరు : నందు రెగ్యులర్ గా కనిపించాడు, నటించాడు కూడా. పాత్ర కోసం కష్టపడినట్లు ఎక్కడా కనిపించదు. “ఉయ్యాల జంపాల” ఫేమ్ పునర్నవి అందంగా కనిపించడంతోపాటు.. తన క్యారెక్టర్ లోని రెండు వేరియేషన్స్ ను అద్భుతంగా పండించింది. గ్లామరస్ గా కనిపించడానికి పెద్దగా మొహమాటపడని పునర్నవి పెద్ద లేదా మీడియం బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు ఎందుకు ఇవ్వడం/రావడం లేదో అర్ధాంకావడం లేదు. సరైన అవకాశం ఇస్తే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకొని స్టామినా ఉన్న నటి ఆమె.
“కుమార్ 21F” తర్వాత మరోమారు నోయల్ నెగిటివ్ రోల్లో అలరించాడు. మనోడి మ్యానరిజమ్స్ & విలనిజం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భద్రమ్, నవీన్ నేని, సుడిగాలి సుధీర్ ల కామెడీ అక్కడక్కడా నవ్వించింది కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు : ప్రవీణ్ స్వరపరిచిన బాణీలు చూడ్డానికంటే వినడానికి చాలా బాగున్నాయి. ముందు వినకపోవడం వల్ల సినిమాలో పాటలు వచ్చిన ప్రతిసారీ “అరే పాటలు బాగున్నాయే” అనిపిస్తుంది. సాంగ్స్ ప్లేస్ మెంట్ & కొరియోగ్రఫీ బాగుండి ఉంటే ఇంకాస్త ఎక్కువ రీచ్ ఉండేది.
జి.ఎస్.రాజ్ సినిమాటోగ్రఫీ రెగ్యులర్ గానే ఉంది. ఎడిటింగ్ సినిమాకి మైనస్ అయ్యింది. డి.ఐ విషయంలో కాస్త జాగ్రత్తపడితే బాగుండేది.
దర్శకుడు కోటి రాసుకొన్న కథలో ఉన్న నవ్యత, కథనంలో లోపించింది. ప్రీక్లైమాక్స్ లో ఉన్న పట్టు సినిమాలో ఎక్కడా కనిపించదు. సినిమా చాలా చోట్ల సాగుతున్న భావన కలుగుతుంది. సరైన స్క్రీన్ ప్లే రాసుకొని.. ఉన్న ట్విస్ట్ లను సరిగ్గా రివీల్ చేసుకొని ఉంటే ఒక మంచి రివెంజ్ థ్రిల్లర్ గా నిలిచేందుకు అర్హత ఉన్న “ఎందుకో ఏమో” సరైన డీలింగ్ & డీటెయిలింగ్ లేకపోవడం వలన ఫెయిల్ అయ్యింది.
విశ్లేషణ : కొత్త దర్శకుడు కావడంతో తడబడ్డాడు కానీ.. కాస్త అనుభవం ఉన్న వారు తీసి ఉంటే మినిమం యావరేజ్ గా నిలిచే కంటెంట్ ఉన్న సినిమా “ఎందుకో ఏమో”. అయితే.. థియేటర్లో చివరి వరకూ ఓపిగ్గా కూర్చుని చూడడం మాత్రం కష్టమే.
రేటింగ్ : 2/5