నీతులు చెప్పడం వేరు వాటిని పాటించడం వేరు. చెప్పినంత సులువు కాదు పాటించడం. అయితే.. సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ గారు మాత్రం పాటించడం ఏమీ అంత కష్టమైన పని కాదు అని నిరూపిస్తున్నారు. దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలంటే.. ప్రపంచం మొత్తం క్లీన్ చేసుకోంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ప్రదేశాల్లో చెత్త లేకుండా చూసుకొంటే చాలు. అలా ప్రతి సగటు పౌరుడు జాగ్రత్త తీసుకొంటే చాలు. ఈ విషయాన్ని ఇప్పటికీ చాలా మంది చెప్పారు.
కానీ.. నాజర్ మాత్రమే చేసి చూపించారు. షూటింగ్ లొకేషన్ లో అందరూ కాఫీ తాగిన తర్వాత ఆ ప్లాస్టిక్ కప్పులను ఎక్కడపడితే అక్కడ పడేయడం చూసి బాధపడిన నాజర్.. తానే స్వయంగా ఓ ప్లాస్టిక్ కవర్ పట్టుకొని ఆ కాఫీ కప్పులన్నిటినీ ఎత్తి చెత్తకుండీలో పడేశారు. తాను కాఫీ కప్పులను తీస్తున్నప్పుడు సెక్యూరిటీ వచ్చి మేం చేస్తామండీ అని చెప్పినా కూడా వాళ్ళను పట్టించుకోకుండా ఆ ఏరియా మొత్తం క్లీన్ చేశారు నాజర్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనీసం నాజర్ ను చూసైనా జనాలు చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయడం మానేస్తారేమో చూడాలి.